ఇబ్రహీంపట్నం, జూలై 7: ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్టార్ కార్యాలయం (Sub Registrar Office) గత 40 ఏండ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హాయాంలో రూ.1.50కోట్ల నిధులు కేటాయించి, మాజీ మంత్రి కేటీఆర్‌తో (KTR) గత 2022సంవత్సరం ఫిబ్రవరిలో భూమిపూజ చేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్లాబ్ పనుల వరకు పూర్తయిన ఈ సొంత భవన నిర్మాణ పనులు తదనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ముందుకు సాగటంలేదు. గత నలభై40 ఏండ్లుగా పురాతనమైన అద్దె భవనంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం కార్యకలాపాలు కొనసాగుతుండటంతో పురాతన భవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు అద్దె భవనం శిథిలావస్థకు చేరటంతో ఇబ్బందులు తప్పటం లేదని చెప్పిన రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది విజ్ఞప్తి మేరకు నూతన భవన నిర్మాణం కోసం ఇబ్రహీంపట్నం పాత బస్టాండు సమీపంలో స్థలం కేటాయించి భవన నిర్మాణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టారు.
చేపట్టిన పనులు బీఆర్ఎస్ సర్కారు హాయాంలో స్లాబ్ పనుల వరకు పూర్తి అయ్యాయి. త్వరలో పనులు పూర్తిచేసి నూతన భవనంలోకి కార్యాలయాన్ని తరలించాలనుకుంటున్న తరుణంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు నేటికి ఎలాంటి శ్రద్ద చూపటంలేదు. దీంతో శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో విదులకు ఇబ్బందులు కలుగుతున్నాయని రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే రియాల్టర్లు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో భూమిపూజ చేసి నిర్మాణ పనులు చేపట్టిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో కోట్ల రూపాయలు వృధాగా పోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అర్థాంతరంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయం ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని కోరుతున్నారు.
గత 40ఏళ్లుగా అద్దె భవనంలోనే..
ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయం కార్యకలాపాలు గత 40ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన అద్దె భవనంలో విదులు కొనసాగటం తీవ్ర ఇబ్బందిగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో గోడలకు నిమ్ము రావటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విలువైన డ్యాకుమెంట్లు కూడా తడిసిపోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం స్పందించి నూతన భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేయించాలని సిబ్బందితో పాటు పలువురు కోరుతున్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయ నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేయాలి : మైలారం విజయ్‌కుమార్
ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వ హాయాంలో భూమిపూజ చేసి పనులు చేపట్టారు. స్లాబ్ వరకు పూర్తయిన రిజిస్టేషన్ కార్యాలయ నిర్మాణ పనులు అర్థాతరంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటంతో స్లాబ్ నిర్మాణ పనులు కూలిపోయే ప్రమాదముంది. ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రేషన్ కార్యాలయ పక్కా భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేయాలి.
కావాలనే దృష్టి సారించటంలేదు: భరత్‌కుమార్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఇబ్రహీంపట్నం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టిన పలు అబివృద్ధి పనులు, సొంత భవనాల నిర్మాణాలకు సంబంధించిన పనులు కాంగ్రెస్ సర్కారు కావాలనే దృష్టి సారించటంలేదు. ఎంతో ఉన్నత ఆశయంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలనే సంకల్పంతో కృషిచేసి ప్రభుత్వంతో పోరాడి నిదులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. అనంతరం వచ్చిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ పనులపై దృష్టి సారించటంలేదు. వెంటనే ప్రభుత్వం చొరువ చూపి ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే భవనాలను పూర్తిచేయించాలి.