యాలాల, డిసెంబర్ 29 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప్ మండలస్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ బాలేశ్వర గుప్తా, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, డీఈఓ రేణుకా దేవితో కలిసి ఆయన ప్రారంభించారు. జాతీయ గీతాలాపన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో క్రీడలు ప్రారంభమయ్యాయి. శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంతో పాటు రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నారన్నారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నదన్నారు.
విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించవచ్చన్నారు. ఈనెల 31 వరకు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభ చాటాలన్నారు. 6 నుంచి 8 తరగతి విద్యార్థులను జూనియర్లుగా 9,10 తరగతి విద్యార్థులను సీనియర్లుగా పరిగణించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, 100, 400, 800, 1500, 3కి.మీ., రన్నింగ్, డిస్కస్‌త్రో, జావలిన్‌త్రో, క్యారమ్స్, చెస్ తదితర క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజూగౌడ్, వైస్ ఎంపీపీ రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆశన్న, పెద్ద్దేముల్ ఎంపీపీ అనురాధ, తాండూరు బీఆర్ఎస్ అధ్యక్షుడు అఫ్పూ నయీమ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు అక్బర్ బాబా, సర్పంచ్‌లు మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, పటేల్ రెడ్డి, భీమప్ప, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అనంతయ్య, ఎంఈఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.