యాచారం, జూన్9 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో ఆదివారం కన్నుల పండువగా జరిగింది. యాచారం, మొగుళ్లవంపు, గాండ్లగూడ, నక్కగుట్టతండాకు చెందిన 86మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ద్వారా 23 సంవత్సరాల తరువాత ఒకే వేదికపై కలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ విద్యా సంవత్సరం తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆట, పాటలతో ఎంతో సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వరం ఎంఈవో కృష్ణ, హెచ్ఎంలు కృష్ణయ్య, నారాయణరెడ్డి, సత్యం, రమేశ్, చంద్రమౌళి, వెంకటలక్ష్మి, పద్మ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1994-1995బ్యాచ్ పదోతరగతి పూర్వపు విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మండల కేంద్రంలోని వెంకట నర్సింహ గార్డెన్లో నిర్వహించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత చిన్ననాటి మిత్రులు కలుసుకొని తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మొక్కను నాటి సంరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. వారు స్థాపించిన స్నేహహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ మిత్రుల పిల్లలు పదోతరగతి, ఇంటర్లో ప్రతిభకనబర్చిన వారికి జ్ఞాపికలను అందజేశారు.
వారి మిత్రుడైన శిరందాస్ జగదీశ్వర్ 42 సార్లు రక్తదానం చేయడంతో ఆయనను శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు, స్నేహ హస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, స్నేహహస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు తల్లోజు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పెరికేటి యాదయ్య, ఉప అధ్యక్షుడు శ్రీను, కోశాధికారి యాదయ్య, ఉన్న వెంకటేశ్, శిరందాస్ జగదీశ్వర్, జహంగీర్, ఆనంద్, ఆనంద్, భిక్షపతి, భయ్య దేవేందర్ పాల్గొన్నారు.
కడ్తాల్ (తలకొండపల్లి) : మండల పరిధిలోని చంద్రధన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-03 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. 21 సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు తమ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటపాటలు, క్విజ్ పోటీలు, డ్యాన్స్‌లతో సరదాగా గడిపారు. తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని వారు ప్రకటించారు. కార్యక్రమంలో రజిత, సరిత, ప్రసన్న, శ్రీలత, సాయిబాబా, శివశంకర్, శేఖర్, మహేందర్, చెన్నయ్య, గీత పాల్గొన్నారు.