తుర్కయాంజాల్, నవంబర్ 22 : ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ అనేక సమస్యలు తిష్ఠవేసి దర్శనమిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులను విడుదల చేసి పాఠశాలలను అభివృద్ధి చేసింది. కానీ ప్రస్తుతం పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని ఉన్నతాధికారుల దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో చేసేదేమి లేక విద్యార్థులు అవే గదుల్లో పాఠాలను వింటున్నారు.
పాఠశాల ఆవరణలో చివరన కృష్ణావాటర్ ట్యాంక్ నిర్మించారు. అయితే ప్రతిరోజూ కృష్ణానీరు ట్యాంక్‌లోకి వస్తున్న క్రమంలో ట్యాంక్ నిండిన అనంతరం కూడా నీటి సరఫరాను నిలిపివేయకపోవడంతో పాఠశాల ఆవరణ మొత్తం కృష్ణానీటితో నిండిపోతున్నది. దీంతో విద్యార్థులు ఉదయం సమయంలో ప్రార్థన చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. సాయంత్రం ఆటలు ఆడుకోవడానికి సైతం కష్టాలు తప్పడం లేదు. ట్యాంక్ నిండిన వెంటనే నీటి సరఫరాను నిలిపివేయాలని జలమండలి సిబ్బందికి పలుమార్లు తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని, దీంతో బురద సమస్య తీరడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు పాఠశాలను ఆనుకొని మున్సిపల్ సిబ్బంది చెత్తను డంపింగ్ చేసి అక్కడ కాల్చుతుండడంతో తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులకు దర్వాసనతో పాటు గదుల్లోకి పొగదూరి భరించలేకపోతున్నారని వాపోతున్నారు. ఈ విషయమై ఉపాధ్యాయులు, విద్యార్థులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లేదా స్థానిక నాయకులు పట్టించుకొని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పాఠశాల ఆవరణలో ప్రతిరోజూ కృష్ణానీరు చేరుతుండడంతో బురదలో నిల్చొని రోజూ ప్రార్థన చేయాల్సి వస్తుంది. ట్యాంక్ నిండగానే నీటి సరఫరాను నిలిపివేస్తే ట్యాంక్ నుంచి నీరు కిందకు రాకుండా ఉంటుంది. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలి.
– సౌమ్య, పదోతరగతి, కొహెడ ప్రభుత్వ పాఠశాల
పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తను డంప్ చేసి కాల్చుతుండడంతో పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా తరగతులు జరుతుగున్న సమయంలో పొగ తరగతి గదుల్లోకి దూరడంతో పాఠాలను వినలేకపోతున్నాం. ఉపాధ్యాయులు అనేకమార్లు స్థానిక నాయకులు, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంతో పేదరికం నుంచి వచ్చిన మాకు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోకపోతే పేదలు విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది.
– బండారి విజయ కృష్ణ, తొమ్మిదో తరగతి, కొహెడ ప్రభుత్వ పాఠశాల