పెద్దేముల్, సెప్టెంబర్ 23 : శిథిలమైన గోడల మధ్య విద్యార్థుల చదువులు అనుక్షణం భయంభయంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో మరమ్మతులు చేయించి, మౌలిక వసతులు కల్పించినప్పటికీ ఇంకా కొన్ని పాఠశాలల్లో పరిస్థితులు మారకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం నూతన భవనం ఉన్నప్పటికీ కొన్ని తరగతులు మాత్రం ఇంకా పాత భవనంలోనే కొనసాగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం.
పెద్దేముల్లో గ్రామ పెద్దలు, అప్పటి ప్రజాప్రతినిధులు 1970లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. దాదాపు 12 గదులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలను 6 నుంచి 10 తరగతులు వరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో 5 గదులను 2000లో గ్రామానికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అప్పగించారు. మిగతా 7 గదుల్లో చాలా రోజులు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నూతనంగా అదనపు గదులను నిర్మించి ప్రారంభించగా..
అక్కడ కొన్ని తరగతులను, పాఠశాల వెనుగభాగంలో అంతకుముందు నిర్మించిన భవనంలోకి కొన్ని తరగతులను తరలించారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థులు ఈ శిథిలమైన గదిలోనే పాఠాలను వింటున్నారు. ఇటీవలే తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మరోమారు అదనపు గదుల నిర్మాణానికి నూతనంగా శంఖుస్థాపన కూడా చేశారు. పాత భవనంలో 7 గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని కూడా శిథిలమైన ఓ గదిలోనే ప్రస్తుతం ఉంచారు.
భవనాన్ని కూల్చివేయాలి
పాఠశాలలో 6 నుంచి 10 తరగతులకు 450 మంది విద్యార్థులుండగా.. పాఠశాల పాత భవనం పూర్తిగా శిథిలమైపోయింది. గోడల రాళ్లు పడిపోతున్నాయి. క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి. పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. కళాశాలకు ఇచ్చిన గదులు శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చి నూతన పాఠశాల అదనపు గదులను నిర్మించారు. మిగతా 7 గదులు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు చొరవ చూపి శిథిలమైన పాత పాఠశాల భవనాన్ని కూల్చివేయాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వేడుకుంటున్నారు.
హిందీ సబ్జెక్టుకు ఒకే ఒక్కడు..
450 మంది విద్యార్థులకుగాను 16 మంది ఉపాధ్యాయులతోపాటు ఓ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఉన్నారు. హిందీ సబ్జెక్టుకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. అలాగే గణితానికి ముగ్గురు ఎస్ఏలకుగాను ఇద్దరు, ఒక రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఇతర పాఠశాలల నుంచి, తక్కువ విద్యార్థులున్న పాఠశాలల నుంచి కేటాయిస్తే విద్యార్థులకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
క్షణక్షణం భయపడుతున్నాం
పాత పాఠశాల భవనాన్ని కూల్చకుండా అలాగే వదిలేయడంతో క్రిమికీటకాదులు సంచరిస్తున్నాయి. శిథిలమై గోడల నుంచి అప్పుడప్పుడు పాములు బయటకు వస్తున్నాయి. ఎప్పుడు ఏమి జరుగతుందోనే భయంతో క్షణక్షణం గడుపుతున్నాం. పాత భవనాన్ని కూల్చేస్తే పాముల బెడద తగ్గుతుంది.
– జాదవ్ భాను, 10వ తరగతి
రాళ్లు ఊడిపడుతున్నాయి
పాఠశాల ఆవరణలో ఉన్న గోడలు పూర్తిగా శిథిలం కావడంతో ప్రతిరోజూ ఆ గోడల నుంచి రాళ్లు ఒక్కొక్కటిగా ఊడిపడుతున్నాయి. రాళ్లు ఒక్కోసారి పెద్దశబ్దంతో కూలుతున్నాయి. అనుక్షణం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాం. మాలో ఉన్న భయం పోవాలంటే పాత గోడలను వెంటనే కూల్చివేయాలి.
– చిప్పె మంజునాథ్, 10వ తరగతి
పోస్టులను భర్తీ చేస్తే బాగుంటుంది
హిందీ, గణితంలో ఒక్కొక్క పోస్టుతోపాటు రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పాఠశాలకు మంజూరు చేస్తే బాగుంటుంది. పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అటువైపు వెళ్లాలంటేనే విద్యార్థులు జంకుతున్నారు. 8వ తరగతిని పాత భవనంలోనే కొనసాగిస్తున్నాం. పాత భవనాన్ని కూల్చివేయాలి. కొత్త తరగతి గదులను నిర్మించాలి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి న్యాయం చేయాలని వేడుకుంటున్నాను.
– సునీత, ప్రధానోపాధ్యాయురాలు