నందిగామ, ఆగస్టు 30 : మాదకద్రవ్యాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఏసీపీ కే శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం నందిగామ మండలం అయ్యప్ప టెంపుల్ పృథ్వీ కాలనీలో శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, నందిగామ సీఐ పీ ప్రసాద్, కొత్తూరు సీఐ నర్సింహారావు, ఎస్ఐలు గోపాల కృష్ణ, తిరుపతిరావు, ఆరుగురు ఏఎస్ఐలు, 50 మంది సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
కిరాణ షాపులు, ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా దొరికిన మద్యం, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గంజాయి, మద్యం, గుట్కా, వంటి మత్తు పదార్థాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.
పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులు అధికంగా వస్తున్నారన్నారు. ఇండ్లు అద్దెకు ఇచ్చే యజమానులు తప్పకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారి ఆధార్ కార్డు, తదితర వివరాలను తెలుసుకున్న తర్వాతే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎలాంటి వివరాలను తెలుసుకోకుండా అద్దెకు ఇవ్వవద్దని, నేరాలు జరిగితే ఇబ్బందులు పడుతారని ఇండ్ల యజమానులకు సూచించారు.