Turkayamjal | తుర్కయంజాల్, మార్చి 25 : తుర్కయంజాల్ మున్సిపాలిటిలో కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మున్సిపాలిటిలోని కాలనీలలో గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్, ద్విచక్ర వాహనదారులను వెంబడించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేతెత్తుతున్నారు. రాత్రి సమయాలలో సైతం రోడ్లపైకి వచ్చి నడుచుకుంటూ వేళ్లే వారిపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటిలో గతంలో చిన్నారులు కుక్కల భారీన పడి గాయాల పాలైన మున్సిపల్ అధికారలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడే స్పందించే అధికారులు తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
మున్సిపాలిటిలో వీధి కుక్కల నిర్మూలనకు అధికారుల చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. నిత్యం ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందిన మున్సిపల్ అధికారులు మాత్రం వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఒక్కసారి వీధి కుక్కలను పట్టుకోని పోయి అనంతరం చేతులు దులుపుకోవడం మున్సిపల్ అధికారుల వంతుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీధి కుక్కల స్వైర విహారంపై స్పందించి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరతున్నారు.
మున్సిపాలిటిలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగింది. గతంలో పలు కాలనీలలో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేసి గాయాలు చేసిన సంఘటనలు మున్సిపాలిటీలో అనేకం ఉన్నాయి. మరోమారు పెద్ద ప్రమాదం చోటు చేసుకోక ముందే మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలను బెడద నుంచి ప్రజలను విముక్తులను చేయాలి.
బచ్చిగళ్ల రమేష్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ నివాసి