ఇబ్రహీంపట్నం, ఆగష్టు 24 : ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోను రాష్ట్రంలోనే ఉత్తమ రెండో డిపోగా అధికారులు ఎంపిక చేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారులు బహుమతిని అందజేశారు. ఈ మేరకు డిపో కార్మికులు, అధికారులు శనివారం రూ.2.50లక్షల చెక్కును అందుకున్నారు. ఆదాయం రాబట్టడంతో పాటు తక్కువ ఖర్చుతో డిపోను అధిక లాభాల వైపు తీసుకురావడంలో కార్మికులు, అధికారులు చేసిన కృషి ఫలితంగా అవార్డు దక్కిందని డిపో మేనేజర్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉన్న 98 ఆర్టీసీ డిపోల్లో ఇబ్రహీంపట్నం డిపోకు రెండో ఉత్తమ అవార్డు దక్కడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో ఉన్న 98డిపోల్లో మొదటి బహుమతి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి, రెండో బహుమతికి ఇబ్రహీంపట్నం, మూడో బహుమతి సిద్దిపేటకు దక్కిందని డిపో మేనేజర్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం డిపోను అధికారులు, సిబ్బంది పట్టుబట్టి గత సంవత్సరం రాష్ట్రంలోనే మూడో ఉత్తమ డిపోగా ఎంపిక చేసుకున్నారని, ఈ ఏడాది రెండో ఉత్తమ డిపోగా అవార్డును తీసుకునేలా కృషి చేశారన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో గ్రామీణ ప్రాంతాలకు అధిక ట్రిప్పులను నడుపడంతో పాటు రెవెన్యూ అధికంగా వచ్చే రూట్లల్లో ఎక్కువ ట్రిప్పులు నడిపించి అధిక లాభాలు రాబట్టారని డిపో మేనేజర్ వివరించారు.
మొదటి స్థానానికి తీసుకొస్తాం :డిపో మేనేజర్ వెంకటనర్సప్ప
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోను రాష్ట్రంలోనే ఉత్తమ డిపోగా ఎంపిక చేసుకోవడం కోసం డిపోలోని కార్మికులు, తామంతా కృషి చేస్తామని డిపో మేనేజర్ వెంకటనర్సప్ప అన్నారు. గత సంవత్సరం మూడో బహుమతి, ఈ ఏడాది రెండో బహుమతి అందుకున్న తాము, మొదటి బహుమతిని కూడా చేరుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. ఉద్యోగులందరి కృషి వల్లనే అవార్డును అందుకున్నామన్నారు. సిబ్బంది అంతా సమష్టిగా కృషి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో డిపోను నిలుపాలని కోరారు.