ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేయడం, సాధారణ కాన్పులకే అధిక ప్రాధాన్యమిస్తుండడంతో సర్కార్ దవాఖానలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. ప్రైవేటు దవాఖానలు ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లు చేస్తూ వేలకు వేలు కొల్లగొడుతుండడంతో జనం ప్రభుత్వ దవాఖానలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 52,109 ప్రసవాలు జరుగగా, అందులో కేవలం 18,250 సిజేరియన్లు మాత్రమే ఉన్నాయి. 33,850 సాధారణ కాన్పుల్లో మెజార్టీ ప్రభుత్వ దవాఖానల్లో జరిగినవే ఉన్నాయి.
-ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 15
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 15: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటే భయపడిన ప్రజలు, గర్భిణులు ప్ర స్తుతం అధికంగా వస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైన వసతులను కల్పించడంతోపాటు అనుభవజ్ఞులైన వైద్యులను నియమించడంతో రోగులకు మెరుగైన వైద్యం అందుతున్నది. మరోవైపు అమ్మఒడి, కేసీఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేయడం, సాధారణ కాన్పుల కే అధిక ప్రాధాన్యమిస్తుండటంతో సర్కార్ దవాఖానలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. ప్రైవేట్ దవాఖానల్లో ధనార్జనే ధ్యేయంగా సి జేరియన్లు చేస్తున్నారు. కాగా రంగారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే..ఈ ఏడాది ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల శాతం మూడుశా తానికిపైగా పెరిగిందని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కుటుంబసభ్యుల ఆలోచన మారాలి..
సిజేరియన్ డెలివరీలకు పరోక్షంగా ఆడపిల్లల తల్లిదండ్రులు, భర్తలు కారణమవుతున్నారు. లక్షల రూపాయలు కట్నం ఇచ్చి పెండ్లి చేశాం. ఈ ఒక్క కాన్పును పూర్తి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. అందుకోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లడం ఎందుకు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే చూపిస్తే సరి పోతుందనే భావన చాలామంది తల్లిదండ్రుల్లో ఉన్నది. దీనికి గర్భిణుల భర్తలూ సహకరిస్తున్నారు. దీనికి తోడు ముహూర్తాలు చూసి మరీ సిజేరియన్ డెలివరీలు చేయిస్తున్నారు. నా పుట్టిన రోజు నాడే నాకు పుట్టబోయే వారి బర్త్ డే ఉండాలని వారాలు, రోజులు నిండక ముందే ఆపరేషన్లు చేయిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈ కారణాలతో సాధారణ ప్రసవాలు కావాల్సినవి సిజేరియన్లుగా మారుతున్నాయి.
సాధారణ ప్రసవాలే మేలు..
సాధారణ కాన్పులు తల్లీబిడ్డకు క్షేమం. నాలుగైదు గంటలపాటు పురిటినొప్పులు భరిస్తే.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పుతాయి. సాధారణ ప్రసవాలతో రక్తస్రావం తక్కువ అవుతుంది. మొదటిసారి సహజ ప్రసవమైతే రెండోసారి కూడా సుఖ ప్రసవమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉం టాయి. కాన్పు జరిగిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత తమ పనులను తాము చేసుకునేందుకు వీలుంటుంది. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రు పాలు తాగించే అవకాశముంటుంది. దాని ద్వా రా శిశువుకు వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. పుట్టే పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వెనుకటి తరం వారు సహజ ప్రసవాల వైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు.
సిజేరియన్లతో అనేక నష్టాలు..సిజేరియన్ వల్ల తల్లీబిడ్డలకు నష్టం. ఈ ఆపరేషన్‌కు గంట సమయమే తీసుకున్నా.. భవిష్యత్‌లో తల్లి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. శరీరంలో నాలుగైదు లేయర్లు కట్చేయాల్సి ఉంటుంది. అప్పుడే గర్భాశయం నుంచి బిడ్డను బయటికి తీయడం సాధ్యమవుతుంది. రక్తస్రావం కూడా అవుతుంది. పైగా సిజేరియన్ తర్వాత గాయం మానేందుకు చాలా సమయం పడుతుంది. కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి అవసరమవుతున్నది. ఆ లోగా జాగ్రత్తలు, పోషకాహారం తీసుకోకపోతే హెర్ని యా, కడుపునొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలి. సిజేరియన్ వల్ల ముర్రుపాలు పట్టించే అవకాశమే లేకుండా పోతున్నది.
ఈ ఏడాదిలో 52,109 ప్రసవాలు..
రంగారెడ్డి జిల్లాలో గతేడాది సుమారు 50 వేల ప్రసవాలు జరుగగా అందులో 28,123 సాధారణ ప్రసవాలే ఉన్నాయి. మిగిలిన వి సిజేరియన్లు. ఈ ఏడాది ఇప్పటివరకు 52,109 ప్రసవాల్లో 18,250 సిజేరియన్‌లుండగా 33,859 సాధారణ ప్రసవాలు జరిగా యి. అంటే గతేడాదితో పోల్చితే సాధారణ ప్రసవాలు మూడు శాతానికి పైగా పెరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసరమైతే తప్పా సిజేరియన్లు చేయడం లేదు. కానీ, ప్రైవేట్‌లో మాత్రం డెలివరీ తేదీకి రెండు నుంచి మూడు వారాల ముందుగానే సీ-సెక్షన్ (సిజేరియన్లు/ ఆపరేషన్లు) చేస్తున్నారు.
సీరియస్‌నెస్ క్రియేట్ చేసి ఆపరేషన్లు చేసుకోవాలని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులను భయపెడుతున్నారు. దీంతో ప్రభుత్వం నియంత్రించినా ప్రైవేట్‌లో ఆపరేషన్లు మాత్రం ఆగడంలేదు. కాగా ఈ విషయమై వైద్యారోగ్యశాఖ నిర్వహించిన సమీక్షలో సీరియస్ అయ్యింది. దీంతో జిల్లా వైద్యాధికారులు త్వరలో తమ పరిధిలోని అన్ని ప్రైవేట్ మెటర్నిటీ దవాఖానల వైద్యుల తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అకారణంగా చేస్తున్న ఆపరేషన్లను ఆపివేయాలని, సాధారణ ప్రసవాలను పెంచాలని ఆదేశించనున్నారు. ఇప్పటివరకు చేసిన డెలివరీలపై నివేదికలు తెప్పించి అవసరం లేని కేసుల్లో ఎందుకు ఆపరేషన్లు చేశారనే విషయాన్ని ఆరా తీయనున్నారు. సరైన సమాధానం చెప్పని దవాఖానల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు సాధారణ ప్రసవాలు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం
ప్రైవేట్ దవాఖానల ధనదాహంతోపాటు కుటుంబసభ్యుల ఆలోచన విధానం సిజేరియన్ డెలివరీలకు కారణం అవుతున్నది. నార్మల్ డెలివరీలు పెరుగాలంటే ప్రైవేట్ దవాఖానల సహకారం తప్పకుండా ఉండాలి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాం. త్వరలో వారితో సమావేశం నిర్వహిస్తాం. గ్రామాల్లో ఏఎన్ఎంల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ ప్రసవాలు చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు, సిజేరియన్లతో వచ్చే ఇబ్బందులను గర్భిణులకు వివరిస్తున్నాం. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నార్మల్ డెలివరీల సంఖ్య పెంచడంలో సఫలమయ్యాం. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నాం.
– వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌వో రంగారెడ్డిజిల్లా