వికారాబాద్, అక్టోబర్ 21 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదులు నగదు, బంగారం పట్టివేత, సీ-విజిల్ యాప్ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పార్టీల అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తప్పనిసరిగా తీసుకున్న చర్యలపై లిఖితపూర్వక సమాధానం అందించాలని సూచించారు. సీజ్ చేసిన బంగారం, నగదు 10 లక్షల కంటే ఎక్కువైతే వెంటనే జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు అప్పగించాలన్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు సీజ్ చేస్తే ఐటీ అధికారులకు అప్పగించాలన్నారు. నగదుపై వచ్చే అప్పీళ్లను సంబంధిత గ్రీవెన్స్ సెల్, ఐటీ అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలతోపాటు తప్పనిసరిగా వీడియో కెమెరా సౌకర్యం ఉండాలన్నారు. ప్రతి తనిఖీ వీడియో కెమెరాలో రికార్డు చేయాలన్నారు. జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముంద్రించి పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, రిటర్నింగ్ అధికారులు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్, విజయకుమారి, శ్రీనివాస్‌రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.