Chilkur Balaji Temple | మనసురాబాద్, ఫిబ్రవరి 10: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి వెనుక ఉన్న కుట్రను వెంటనే చేధించి నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శృంగారం తిరువెంగళాచార్యులు, ప్రధాన కార్యదర్శి సేనాపతి మోహన్ డిమాండ్ చేశారు.
మనసురాబాద్ డివిజన్ పరిధి చంద్రపురి కాలనీలోని శ్రీ వైష్ణవ సేవా సంఘం ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామరాజ్యం అనే ముసుగులో చిలుకూరు దేవాలయ అర్చకులు రంగరాజన్‌ను అనేక విధాలుగా వేధించి, నేలపై కూర్చోబెట్టి, కొట్టి, దుర్భాషలాడుతూ వికృత చేష్టలకు పాల్పడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కొందరు వ్యక్తులు నల్లని బట్టలు వేసుకొని చెప్పులు బూట్లు ధరించి ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై దాడి చేయడానికి సభ్య సమాజం, సనాతన సాంప్రదాయపరులు క్షమించరని అన్నారు. దేవాలయ అర్చకులపై, సనాతన ధర్మపరులపై ఇటీవల జరుగుతున్న అరాచకాలు సహించలేని ఈ దుశ్చర్యలను ఆపే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ వైష్ణవ సేవా సంఘం ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ఎప్పటికీ సహించదని తాము కూడా తగిన విధంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణ కోసం నిబద్ధతతో కార్యక్రమాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. హిందువులను టెర్రరిస్టులుగా చూపడానికి కొందరు ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నట్టు అనుమానించాల్సి వస్తుందని తెలిపారు. రామరాజ్యం పేరిట రావణ రాజ్యాన్ని సృష్టించేందుకు కొందరు పన్నుతున్న పన్నాగాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి సముద్రాల బద్రీనాథ్, న్యాయ సలహాదారుడు వంగిపురం రత్నకుమార్ పాల్గొన్నారు.