మొయినాబాద్, మే 12 : ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వలస వచ్చిన కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. నగరం నుంచి బస్సుల్లో నిండుగా రావడంతో పాటు కొన్ని ప్రత్యేకంగా కొడంగల్‌కు బస్సులు వేయడంతో.. అలాంటి బస్సులను మొయినాబాద్‌లో ఆపకుండ వెళ్లిపోయారు. కొందరు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అవస్థలు పడ్డారు. ప్రయాణికుల అవసరాలను గమనించిన ప్రైవేట్ వాహనదారులు రెండింతల చార్జీలు వసూలు చేశారు.
నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌కు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ బస్సులతో పాటు హైదరాబాద్ మహానగరంలో నడిచే సిటీ సబర్బన్, మెట్రో బస్సులను నడిపించారు. ప్రత్యేక బస్సులు వేసినా కొడంగల్, కోస్గి వెళ్లేవారికి సరిపోలేదు. ఆ ప్రాంత జనం ప్రైవేట్ వాహనాల్లో డ్రైవర్లు ఎంత అడిగితే అంత ఇచ్చి సొంత గ్రామాలకు చేరుకున్నారు. కొడంగల్‌కు వెళ్లే బస్సులు 10 నిమిషాలకు ఒకటి వెళ్లాయి. కానీ వికారాబాద్, తాండూరు ప్రాంతాలకు బస్సులను అంతంత మాత్రమే నడిపించారు. బస్సులు సరిగ్గా రాక.. ఎండను తట్టుకోలేక ప్రయాణికులు రోడ్డు డివైడర్ మధ్యలోని చెట్ల కింద, దుకాణాల ఎదుట సేద తీరారు.