వికారాబాద్, జూన్ 26 : తెలంగాణ రాష్ట్రంలో జడ్పీ భవనం మొదటిసారిగా వికారాబాద్‌లోనే ప్రారంభించడం జరిగిందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. వికారాబాద్ జడ్పీ భవనాన్ని తెలంగాణ రాష్ర్టానికి తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు.
భవనాన్ని మరో 6 లేదా 8 నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధికి కృషి చేసిన జడ్పీ చైర్‌పర్సన్‌ను కొనియాడారు. రాజకీయంగా వారి అనుభవాలను, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించాలని, ప్రజాప్రతినిధులను స్టేజీ పైకి పిలువాలన్నారు. ఏ సమావేశం ఏర్పాటు చేసినా జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీలను ఆహ్వానించాలని స్పీకర్ సూచించారు. జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. జడ్పీ భవన నిర్మాణానికి రూ.5.15 కోట్లు, మూడున్నర ఎకరాల స్థలంలో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌లో ఉన్న నిధులు రూ.3కోట్లు జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. గ్రామాల్లో జడ్పీటీసీలు అభివృద్ధి పనులు పూర్తి చేశారని.. వారికివ్వాల్సిన నిధులు ఇంకా దాదాపు రూ.5 నుంచి 6 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు.
మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జడ్పీ భవనానికి ప్రహరీ, గ్రౌండ్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఏర్పాటు కాని జడ్పీ భవనం వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సమస్యలను స్పీకర్, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి పలు అభివృద్ధి పనులు చేశారని వివరించారు. అసంపూర్తిగా ఉన్న జడ్పీ భవనాన్ని ఇంత తొందరగా ప్రారంభించడం సరికాదన్నారు. భవనం పూర్తి చేసిన తరువాత ప్రారంభిస్తే బాగుండేదన్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 14 మంది ట్రాన్స్జెండర్లకు ధ్రువపత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. వీరు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలకు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.