వికారాబాద్, ఆగస్టు 23 : సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హుల ఇంటికి చేర్చే బాధ్యత అధికారులపై ఉన్నదని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు-2024 ముసాయిదాబిల్లు, ఎల్ఆర్ఎస్పై అవగాహన కార్యక్రమంతోపాటు జిల్లాలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రానున్న ఐదేండ్లలో జిల్లా అభివృద్ధిపథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.
జిల్లాలో పరి శ్రమలు, విద్యారంగం అభివృద్ధితోపాటు రూ.400 కోట్లతో అనంతగిరిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ఉద్యోగులకు ప్రతినెలా క్ర మం తప్పకుండా వేతనాలు చెల్లిస్తున్నదనన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యవసా యం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. వర్షాలతో పంట నష్టం జరిగితే అధికారులు నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రతినెలా ముఖ్యమైన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తామని.. ఇందులోని ప్రతి అంశంపైనా అధ్యాయనం చేసి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా భూముల సమస్య సత్వర పరిష్కారానికి భూమాత చట్టాన్ని తీసు కొస్తున్నట్లు సభాపతి తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావివర్గం, న్యాయవాదులు, స్వ చ్ఛంద సంస్థల సలహాలను పరిగణనలోకి తీసుకుని ఆ చట్టాన్ని పకడ్బందీగా చేపడతామన్నారు. 2014 కంటే ముందు ఉన్న సాదాబైనామా సమస్యలను పరిష్కరించే అవకాశమూ ఉందన్నారు. జిల్లాలో చేపడుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఎన్ని చెరువులు, కుంటలు నిండాయి, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుతామో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలను సమర్పించాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు. పశు సంపద సంరక్షణకు వాటికి వ్యాక్సినేషన్ వేయాలన్నారు.
గురుకులాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులను కల్పించాలన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు సమృద్ధిగా అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. వైద్యారోగ్య, విద్యుత్తు, మైనింగ్, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు, ఆర్అండ్బీ, పంచాయ తీరాజ్ శాఖలకు సంబంధించిన పనులపై ఆరా తీశా రు. సమీక్షలో చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి, తాండూరు, చేవెళ్ల ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ చైర్పర్సన్లు మంజులారమేశ్, స్వప్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.