వికారాబాద్, ఏప్రిల్ 14 : ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలంగాణ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వికారాబాద్‌లో సాంఘికక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ప్రపంచంలోనే ఉత్తమమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన గొప్ప మహనీయుడని, వారి జీవితం మనకందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ, అభివృద్ధి అధికారి మల్లేశం, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, కమిషనర్ జాకీర్ అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజస్, ఏఎస్‌డబ్ల్యూ ఉమాపతి, ఆయా పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.