వికారాబాద్, ఆగస్టు 15 : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేలా ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.
మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం కల్పించామన్నారు. ఇప్పటి వరకు వికారాబాద్ జిల్లాలో 1.54 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు. దీని ద్వారా రు. 56 కోట్ల లబ్ధి చేకూరిందని స్పీకర్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో 2,836 మంది పేదలకు చికిత్సలు చేయడం జరిగిందన్నారు. నిరుపేదలందరి సొంతింటి కల నిజం చేయాలని భావించి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించ తలపెట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 గృహాలు నిర్మిస్తామన్నారు.
మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరాలో భాగంగా జిల్లాలో లక్షా20 మందికి లబ్ధి చేకూరుతుందని, ఇప్పటికే 66,682 మంది వినియోగదారులకు రూ.1. 73 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. గృహ జ్యోతి కార్యక్రమంలో భాగంగా 1,25, 721 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, రూ.9.8 కోట్ల సబ్సిడీ అందినట్లు తెలిపారు.
రూ.2 లక్షల పంట రుణమాఫీలో భాగంగా జిల్లాలోని 1,09269 మంది రైతన్నలకు రూ.905 కోట్ల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తి కలిగించామన్నారు. రైతు బీమా పథకం నుంచి 5829 మంది మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.291.45 కోట్లు అందించామన్నారు. వ్యవసాయ రంగానికి వాన కాలంలో 75,437 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటి వరకు 30,320 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయగా, 15,663 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
రైతు వేదిక ద్వారా రైతు నేస్తం కార్యక్రమంతో వివిధ అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ సంవత్సరం 830 ఎకరాల్లో రూ.2.40 కోట్ల వ్యయంతో పండ్లు, కూరగాయలు, పూల తోటల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వివిధ మరమ్మతు పనులు చేపట్టేందుకు రూ.8 కోట్లు మంజూరు చేస్తూ, 1062 పాఠశాలలను గుర్తించి ఇప్పటికీ 924 పాఠశాలల్లో పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందులో 202 పాఠశాలల్లో అన్ని రకాల పనులు పూర్తయ్యాయని వివరించారు.
జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల ద్వారా 5337 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 588 చౌక ధర దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో భాగంగా మహిళా సంఘాలకు స్త్రీనిధి బ్యాంక్ ద్వారా 216 సంఘాలకు రూ. 5.56 కోట్ల రుణం ఇవ్వడం జరిగిందన్నారు. 1447 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 13,869 లక్షల రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 3527 మంది మహిళల నిమిత్తం రూ.23.41కోట్ల ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
వృద్ధాప్య, వితంతు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ, ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న రూ.26.36 కోట్ల పింఛన్‌తో 1.10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా లక్ష కుటుంబాలకు లక్షా 82 వేల మంది కూలీలకు పని దినాలు కల్పించి రూ.137 కోట్లు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతానికి రూ.9 కోట్ల 74 లక్షల వ్యయంతో 9 అదనపు సామర్థ్యం గల మాస్ ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన కోటిపల్లి ప్రాజెక్టును స్థిరీకరించి 9,200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. ఉద్దండపూర్ ఎడమ ప్రధాన కాలువ 10వ కిలో మీటర్ నుంచి 122.3 కిలోమీటర్ వరకు రూ.1470 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో పరిగి , తాండూరు శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.