వికారాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు పేదల కడుపు కొడుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 12 నెలల తర్వాత కొత్త కార్డులను జారీ చేసింది. అయితే, ప్రభు త్వం కొత్త కోటా బియ్యాన్ని పంపిణీ చేయగా జిల్లాలోని పలువురు డీలర్లు దానిని పక్కదారి పట్టిస్తున్నారు. కొత్త లబ్ధిదారులకు చెందిన రెండు నెలల బియ్యం కోటాను బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారు.
కొత్త రేషన్ కార్డుదారులకు కోటా రిలీజ్ అయిన సమాచారాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఇవ్వడంలో నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో ఇదే అదునుగా భావించిన కొందరు డీలర్లు అదనంగా వచ్చిన బియ్యం కోటాను స్వాహా చేస్తున్నారు. అయితే, గతంలో ప్రతినెలా 5,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాలో పంపిణీ చేయగా..
కొత్త రేషన్‌కార్డులతోపాటు కొత్తగా చేర్చిన యూనిట్లతో జిల్లాకు సరఫరా అయ్యే బియ్యం కోటా 5,780 మెట్రిక్ ట న్నులకు పెరిగింది. గతంతో పోలిస్తే 180 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాకు వచ్చే కోటాకు అదనంగా చేరింది. రెండు నెలలకు సంబంధించి 360 మెట్రిక్ టన్నుల వరకు బియ్యం అదనంగా జిల్లాకు సరఫరా కాగా, సంబంధిత అదనపు కోటాలో దాదాపు 200 మెట్రిక్ టన్నుల వరకు రేషన్ డీలర్లు పేదలకు పంపిణీ చేయకుండా దారి మళ్లించినట్లు సమాచారం.
పౌరసరఫరాల అధికారుల నిర్లక్ష్యం..
జిల్లాలో కొత్తగా జారీ అయిన రేషన్ కార్డులతోపాటు కొత్తగా యాడ్ అయిన యూనిట్లకు సం బంధించి గతనెల నుంచి రేషన్ బియ్యం కోటా ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. జిల్లాలో గతంలో 2,46,000 రేషన్‌కార్డులుండగా 8,44,000 మంది లబ్ధిదారులున్నారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులతోపాటు కొత్తగా చేరిన సభ్యులతో జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య 2,48,475కు చేర గా, 8,87, 912 మంది లబ్ధిదారులున్నారు. వాటిలో అంత్యోదయ కార్డులు 26,621 ఉండ గా.. లబ్ధిదారులు 79,524 మంది, అన్నపూర్ణ కార్డుదారులు 41 మంది, ఆహార భద్రతాకార్డులు 2,21,818 ఉండగా.. లబ్ధిదారులు 8,08, 347 మంది ఉన్నారు.
అయితే, గతంతో పోలిస్తే జిల్లాలో 2,000 కార్డులు కొత్తగా జారీ కాగా, 40,000 యూనిట్లు పెరిగాయి. కొత్తగా జారీ అయిన లబ్ధిదారులకు రిలీజ్ అయ్యే కోటాకు సం బంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనా ర్హం. కాగా, కొందరు రేషన్ డీలర్లు నిజాయితీగా కొత్త రేషన్‌కార్డులతోపాటు యాడ్ అయిన యూ నిట్లను కలిపి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయగా..
చాలామంది డీలర్లు కొత్త రేషన్‌కార్డులతోపాటు యాడ్ అయిన యూనిట్ల లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండానే రెండు నెలలకు సంబంధించిన కోటాను స్వాహా చేసినట్లు తెలిసింది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే రేషన్ డీలర్లు పేదలకు పంపిణీ చేయాల్సిన సన్న బియ్యాన్ని స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ నెల కోటాకు సంబంధించి గత వారం, పది రోజులుగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్న దృష్ట్యా రేషన్ అదనపు కోటా రిలీజ్ అయిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ప్రతి రేషన్ షాపులోనూ కొత్తగా వచ్చిన లబ్ధిదారుల వివరా లు డిస్ ప్లే చేసేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తాం. ఎక్కడైనా రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టు తెలిస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలి.
-లింగ్యానాయక్, వికారాబాద్ అదనపు కలెక్టర్