సమాజంలో పోలీసులంటే గౌరవ, మర్యాదలున్నాయి. ప్రజల మాన, ప్రాణాలను రక్షించే పోలీసుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగినవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రకమైన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులే పోలీస్ శాఖలో ఎక్కువయ్యారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో పోలీస్ శాఖనే కాకుండా అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. భూముల ధరలు ఎక్కువగా ఉండి, ఎక్కువగా సంపాదన వచ్చే పోలీస్ స్టేషన్లను ముందే ఎంచుకుంటున్న పోలీసులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో డబ్బులిచ్చి వస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జోరుగా జరుగుతున్నది. పోస్టింగ్ వచ్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇస్తున్న డబ్బులను తిరిగి రాబట్టుకునేందుకు ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.- వికారాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని యాలాల మండలంలోని కాగ్నా నుంచి ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 40 ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ ఇసుక దందాలోనూ కొందరు పోలీసుల ప్రమేయం ఉందనే ప్రచారం జోరందుకున్నది. అయితే ఏకంగా పోలీసులే ఈ అక్రమ ఇసుక రవాణాను దగ్గరుండి చూసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.3-4 వేల వరకు వసూలు చేస్తున్న పోలీసులు దగ్గరుండి నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. పోలీసులు ఇసుక మాఫియా నుంచి వసూలు చేసే డబ్బులు స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పోలీసు అధికారులకు అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక దందాను అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే వెనకుండి నడిపిస్తుండడంతో ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకచోట అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడుతున్నప్పటికీ అక్రమ ఇసుక రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. అక్రమంగా ఇసుక తరలింపుపై నిఘా పెట్టి అడ్డుకోవాల్సిన పోలీస్ అధికారులు ఇసుక మాఫియా ఇచ్చే మామూళ్లతో చూసీచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. కాగ్నా నది పరీవాహక ప్రాంతంతోపాటు శివసాగర్, తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలించడంతో జిల్లా ఖజానాకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నది.
జిల్లాలో తాజాగా నాగసముందర్ గ్రామంలో డబ్బా ఏర్పాటు విషయంలో ఏర్పడిన పంచాయతీలో ధారూరు ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్ రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్‌తోపాటు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఉత్తమ పోలీసుగా అవార్డు పొంది 20 రోజులు కాకముందే సదరు పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడం గమనార్హం. రెండు నెలల క్రితం స్టేషన్ ధారూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైనప్పటికీ కీచక టీచర్ వద్ద రూ.3 లక్షలు తీసుకున్న ఏసీబీకి చిక్కిన ఎస్ఐ రెండు నెలలపాటు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. సాక్షాత్తు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి పలుమార్లు స్వయంగా ఫోన్ చేసి ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులపై సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. మరోవైపు ఇటీవల ఓ ఎస్ఐ తమ మాట వింటలేరనే కారణంగా కొందరు కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మరొకరిని తీసుకువచ్చేందుకు బేరసారాలు జరుపుతుండగా, విషయం తెలుసుకున్న సదరు ఎస్ఐ వెంటనే ఎమ్మెల్యేకు డబ్బులు సమర్పించుకోవడంతో బదిలీ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతున్నది. ఇలా ప్రజాప్రతినిధులు చెప్పినవారికే పోస్టింగ్ ఇస్తుండడంతో అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలోని కొన్ని పోలీస్స్టేషన్లయితే ఏకంగా సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయాయి. సివిల్ (భూ తగాదాలు) వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నప్పటికీ కొందరు పోలీసు అధికారులు ఏమాత్రమూ పట్టించుకోకపోవడం గమనార్హం. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిత్యం భూ తగాదాలకు సంబంధించి పోలీసు అధికారులు సెటిల్మెంట్లు చేస్తూ వసూళ్లకు అడ్డాగా మార్చుకుంటున్నారు. డబ్బులిచ్చేవారివైపే నిలుస్తూ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వచ్చే పేదలకు అన్యాయం చేస్తూ పోలీస్ శాఖకు మాయని మచ్చగా కొందరు పోలీసు అధికారులు నిలుస్తున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో కొందరు ఎస్ఐలు, సీఐలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, అవినీతికి పాల్పడితే కటకటాలు తప్పవని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 9440446140ను సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.
వికారాబాద్ : అడ్డగోలుగా దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పోలీసుల పోస్టింగ్‌లకు డిమాండ్‌ను బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పోలీసు శాఖలో జోరుగా పైరవీలు నడుస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే పోస్టింగులు నడుస్తున్నాయన్నారు. బదిలీలను సైతం తమ వ్యక్తగత అవసరాలకు అనుకూలంగా మార్చుకుని వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో ఒక్క పోలీస్ అధికారి దగ్గర కూడా పోస్టింగ్‌ల కోసం డబ్బులు తీసుకోలేదు కాబట్టి వారి వృత్తి వారు సజావుగా చేసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీరు మారింది, పోస్టింగ్ రావాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. ఆ భారాన్ని వాళ్లు వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వస్తున్న ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.