వికారాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): పంట రుణాలు మాఫీ కాకపోవడంతో జిల్లాలో ఏర్పాటు చేసిన రుణమాఫీ గ్రీవెన్స్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. రుణమాఫీ కాని రైతుల వివరాల ఆధారంగా వ్యవసాయాధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. అయితే అర్హతలున్నా వేలాది మంది రైతుల రుణాలు మాఫీ కాకపోవడంతో అన్నదాతలు మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలు, ఏడీవో, జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఇప్పటికే ఒక్కొక్కరూ నాలుగైదు సార్లు ఫిర్యా దు చేసినా సమస్య పరిష్కారం కాకుండానే మళ్లీ ఇం టింటి సర్వే నిర్వహిస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎంత రుణం తీసుకున్నారు..? రెన్యువల్ చేసుకున్నారా..? లేదా..? రేషన్ కార్డు వివరాలు, పట్టా పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాలోని పేర్లను పరిశీలించి వ్యవసాయాధికారులు యాప్‌లో ఎంట్రీ చేస్తున్నారు. అయితే పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖా తాల్లో వేర్వేరుగా నమోదైన పేర్లను సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో రైతులు గత రెండు రోజులుగా బ్యాంకులకు అధికంగా తరలివస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే వాటి ఎదుట పడిగాపులు గాస్తున్నారు.
నవాబుపేట మండలంలో అత్యధికంగా..
జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్‌కు ఇప్పటివరకు 6,729 మంది రైతులు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. అత్యధికంగా నవాబుపేట మండలం నుంచి వెయ్యికిపైగా అన్నదాతల నుంచి ఫిర్యాదులొచ్చాయి. కాగా జిల్లాలో సుమారు 1.70 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే వారిలో 91,956 మంది రైతుల రుణాలే మాఫీ అయ్యాయి. అయితే మొదటి విడత లో రూ.లక్షలోపు 46,633 మంది రైతులకు రూ.256.26 కోట్లు, రెండో విడతలో 26,438 మం ది రైతులకు రూ.265.04 కోట్లు, మూడో విడతలో 18,885 మంది రైతులకు రూ.247.71 కోట్ల రుణా లు మాఫీ అయ్యాయి.
అయితే మూడు విడతల్లోనూ రుణమాఫీ కాని అర్హులైన వేలాది మంది అన్నదాతలు డీఏవో, ఏడీ, మండల వ్యవసాయాధికారి కా ర్యాలయాల్లో తమ పంట రుణాలు మాఫీ కాలేదం టూ ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదును కూడా ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. అయితే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవ డం, ఒకరి ఆధార్ నంబర్‌కు బదులు మరొకరి ఆధా ర్ నంబర్‌ను ఎంట్రీ చేయడం, వడ్డీని కలపకుండా రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే ఎంట్రీ చేయడం తదితర కారణాలతో జిల్లాలోని దాదాపు 80 వేల మంది రైతులు నష్టపోయారు. మరోవైపు రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతుల పరిస్థితి మరీ గందరగోళంగా తయారైంది.
కటాఫ్ రుణానికి మించి ఉన్న రైతుల్లో చాలామంది ఇప్పటికే పైన ఉన్న మొత్తాన్ని చెల్లించి సంబంధిత రసీదులను వ్యవసాయాధికారులకు అందజేసినా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కటాఫ్ రుణానికి మించి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తేనే మాఫీ అవుతుందని వ్యవసాయాధికారులు చెప్పడంతో అన్నదాతలు అప్పులు చేసి మరీ ఆ మొత్తాన్ని చెల్లించా రు. అయితే రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఎప్పటివరకు అన్నదాతలు చెల్లించాలో గైడ్‌లైన్స్ విధించలేదు.
రుణమాఫీ గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదులు
మండలం : ఫిర్యాదులు
నవాబుపేట : 1127
వికారాబాద్ : 425
ధారూరు : 474
మోమిన్‌పేట : 177
కోట్‌పల్లి : 175
మర్పల్లి : 333
పరిగి : 486
పూడూరు : 459
కులకచర్ల : 228
దోమ : 284
తాండూరు : 184
యాలాల : 443
పెద్దేముల్ : 179
బషీరాబాద్ : 248
కొడంగల్ : 287
దౌల్తాబాద్ : 590
బొంరాస్‌పేట : 508
బంట్వారం : 56
చౌడాపూర్ : 66
మొత్తం : 6729