HDL And LDL | మన గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్డిఎల్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని అదనపు కొలెస్ట్రాల్ ను శుభ్రం చేసి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. హెచ్డిఎల్ ఒక స్కావెంజర్ లాగా పని చేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కాలేయానికి పంపిస్తుంది. కాలేయం ఈ చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపుతుంది. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. ఇక మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు 40 mg/dl కంటే తక్కువగా ఉంటే ప్రమాదంగా భావిస్తారు. 40 నుండి 59 mg/dl స్థాయిలను సాధారణంగా పరిగణిస్తారు. 60 mg/dl లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలను ఉత్తమంగా పరిగణిస్తారు. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. కనుక మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలిసి ఉండడం ముఖ్యం.
ముఖ్యంగా మన జీవనశైలిలో మార్పులు మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో ఎంతో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి అనుకునే వారు ధూమపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం కారణంగా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. దీని వల్ల ధమనులల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ధూమపానం మానేయడం వల్ల గుండె ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే వాటిని తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ లు, యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. అలాగే ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం చేయాలి. నడక, యోగా వంటివి చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తో పాటు గుండె ఆరోగ్యం కూడా పెరుగుతుంది. వారానికి 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా ఓట్స్, బాదం, వాల్నట్స్, గింజలు, అవిసె గింజలు, చియా గింజలు వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇక కార్బోహైడ్రేట్స్ ను తీసుకోవడం నియంత్రించాలి. పాల ఉత్పత్తులను కూడా మితంగా తీసుకోవాలి. ఆహారంలో ఆలివ్ నూనె, వేరుశనగ లేదా పొద్దు తిరుగుడు నూనెలను తీసుకోవాలి. తృణ ధాన్యాలు, పప్పు దినుసులను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, ధూమపానాన్ని మానేయడం వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మన శరీరంలో హెచ్డిఎల్ పెరగడం ఎంత ముఖ్యమో, ఎల్డిఎల్ తగ్గడం కూడా అంతే ముఖ్యం. అలాగే రక్తపరీక్షలు చేయించుకున్నప్పుడు హెచ్డిఎల్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి జీవన శైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు.