– ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, జనవరి 30 : మహాత్మా గాంధీ మహత్తర జీవితం, ఆయన ఆదర్శాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.ఖాలా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, అహింస, నైతిక విలువలు అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. ఆయన జీవన విధానం. స్వీయ క్రమశిక్షణ, సేవాభావం, సామాజిక సమానత్వం పట్ల ఆయన చూపిన అంకితభావం నేటి తరానికి మార్గదర్శకం అన్నారు. నేటి కాలంలో పెరుగుతున్న అసహనం, హింస, స్వార్థం మధ్య గాంధీ ఆలోచనలు మరింత అవసరంగా మారాయన్నారు. మన ఆలోచనల్లో, మాటల్లో, కార్యాచరణలో సత్యం, అహింస పాటించినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి,ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, యుసిసిబిఎం ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ శేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ కిరణ్మయి, రమేష్ నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.