మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తూ చేయూతనందిస్తున్నది. ఈ రుణాలతో గేదెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడంతో పాటు కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ మహిళలు ఉపాధి పొందుతున్నారు. వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.538 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.309.59 కోట్ల రుణాలను అందజేసింది.
ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను ఇస్తుండగా, సంఘాల పనితీరును బట్టి పలు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా 657 గ్రామ సంఘాలుండగా, 13,218 స్వయం సహాయక సంఘాలు, 1.80 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకున్న లబ్ధిదారులు రాష్ట్ర సర్కార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– వికారాబాద్, డిసెంబర్ 20, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాలవారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణ దుకాణాలను నిర్వహించేందుకు, గేదెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడం, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలను తీసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.538 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 57.52 శాతం మేర రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది రూ.361 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. లక్ష్యానికి మించి రూ.371.49 కోట్ల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు.
జిల్లావ్యాప్తంగా 657 గ్రామసంఘాలు, 13,218 స్వయం సహాయక సంఘాలు, 1.80 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందుతూ రెగ్యులర్‌గా ఉన్న స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు తోడ్పాటునందిస్తున్నారు.
ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎస్‌హెచ్‌జీలు వృద్ధి చెందడంలో చేయూతనందిస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి పలు సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
ఇప్పటివరకు రూ.309 కోట్ల రుణాలు మంజూరు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాలకు 57.52 శాతం మేర రుణాలను మంజూరు చేశారు. అత్యధికంగా కోట్‌పల్లి మండలంలో 70.98 శాతం, నవాబుపేట్‌లో 69.92, వికారాబాద్‌లో 68.18, బంట్వారంలో 63.75, కొడంగల్‌లో 63.36, మర్పల్లిలో 61.23, బషీరాబాద్‌లో 58.67, పెద్దేముల్లో 58.59, మోమిన్‌పేట్‌లో 57.96, చౌడాపూర్ మండలంలో 58.51 శాతం మేర బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలలు గడువున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 5807 స్వయం సహాయక సంఘాలకు రూ.309 కోట్ల రుణాలను మంజూరు చేశారు. దోమ మండలంలో 23.82 కోట్లు, కుల్కచర్లలో రూ.16.94, యాలాలలో రూ.16.92, తాండూరులో రూ.18.74, బొంరాస్‌పేట్ మండలంలో రూ.17.82 కోట్ల రుణాలను మంజూరు చేశారు.
అలక్ష్యానికి మంచి రుణాలను మంజూరు చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఎన్పీఏ(పనిచేయని సంఘాలు)లపై నజర్ పెట్టారు. మొండికేసిన సంఘాలపై దృష్టి పెట్టి సంఘాలవారీగా అవగాహన కల్పిస్తున్నారు. రుణాలు తిరిగి చెల్లించడంలో మొండికేసిన సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను కూడా నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా 1316 స్వయం సహాయక సంఘాల నుంచి రూ.7.25 కోట్ల పెండింగ్ బకాయిలను వసూలు చేయాల్సి ఉంది. సెప్టెంబర్‌లో ఎన్పీఏ 4.87 శాతం ఉండగా, ప్రస్తుతం 4.68 శాతానికి తగ్గింది.
లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేస్తాం
– డీఆర్డీవో కృష్ణన్
ఈ ఆర్థిక సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటివరకు 57 శాతం మేర రుణాలను మంజూరు చేశాం. అన్ని మండలాల్లో వంద శాతం రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు.