పుర పోరుకు నేడే పోలింగ్ జరుగనున్నది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, ఆమనగల్లు, మొయినాబాద్, శంకర్పల్లి మున్సిపాలిటీల్లోని 126 వార్డులకు.. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోని 98 వార్డులకు ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1,75,974మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగా, వికారాబాద్ జిల్లాలో అధికారులు 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 1,74,221 మంది ఓటు వేయనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఇందుకోసం 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే చేరవేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌తోపాటు సీసీటీవీ కెమెరాలతో పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించనున్నారు. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉన్న మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అదనంగా పోలీస్ సిబ్బందితో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు.
దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, అగ్నిమాపక వాహనం, వైద్య శిబిరంతోపాటు ఇతర అన్ని మౌలిక వసతులు కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. అదేవిధంగా జిల్లా లో 1,74,221 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 100 వార్డులుండగా వికారాబాద్ మున్సిపాలిటీలోని రెండు వార్డుల్లో ఏకగ్రీవం కాగా మిగిలిన 98 వార్డులకు జరుగనున్న ఎన్నికల బరిలో 341 మంది అభ్యర్థులు ఉన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో 112 మంది, తాండూరులోని 36 వార్డుల్లో 135 మంది, పరిగి మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో 60 మంది, కొడంగల్ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
సరిపడా బ్యాలెట్ బాక్సులు
పుర పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో 261 పోలింగ్ కేంద్రాలుండగా సరిపడా బ్యాలెట్ బాక్సులతోపాటు అదనంగా బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరవేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో 74 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 53 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుండడంతో అదనపు బలగాలతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా క్షుణ్ణంగా వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి 84 పోలింగ్ లోకేషన్లతోపాటు 58 మంది మైక్రో అబ్జర్వర్లు, 30 మంది జోనల్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతోపాటు మొత్తం 1566 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వారిలో 313 మంది పీవోలు, 313 మంది ఏపీవోలు, 940 మంది ఓపీవోలను పోలింగ్‌కు నియమించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు డీఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు సుమారు 800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. పోలీస్ ఎస్కార్ట్‌తో బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు.. అక్కడి నుంచి తిరిగి లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లనున్నారు.
మొత్తం ఓటర్లు 1,74,221 మంది..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 1,74,221 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు-85,625 మంది ఉండగా మహిళలు-88,550 మంది, ఇతరులు-32 మంది ఓటర్లున్నారు. తాండూరు మున్సిపాలిటీలో అత్యధికంగా 77,029 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీలో 11,565 మంది
ఉన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో ఓటర్లు 58,013 మంది ఉండగా .. వారిలో పురుషులు-28,701, మహిళలు-29,285, ఇతరులు- 27 మంది.. తాండూరు మున్సిపాలిటీలో ఓటర్లు 77,029 మంది ఉండగా.. వారిలో పురుషులు-37,499, మహిళలు-39,525, ఇతరులు-ఐదుగురు.. పరిగి మున్సిపాలిటీలో మొత్తం 27,614 మంది ఉండగా, వారిలో పురుషులు-13,822, మహిళలు-13,792 మంది.. కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 11,565 మంది ఉండగా.. వారిలో పురుషులు-5610 మంది, మహిళలు-5955 మంది తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. ఓటరు ఎపిక్ కార్డులు లేకుంటే ఆధార్ కార్డు, పాస్‌పార్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాస్ పుస్తకం, ఉపాధి హామీ జాబ్‌కార్డు, రేషన్ కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి గుర్తింపు కార్డుగా చూపించొచ్చు.
రంగారెడ్డి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, ఆమనగల్లు, మొయినాబాద్, శంకర్పల్లి మున్సిపాలిటీల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది.
జిల్లాలో 1,75,974 మంది ఓటర్లు..
జిల్లాలో ఎన్నికలు జరుగనున్న ఆరు మున్సిపాలిటీల్లో 1,75,974 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500 నుంచి 800 మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కోసం జిల్లాలో 28 మంది జోనల్ ఆఫీసర్లు, 18 మందితో ఆరు ఫ్ల్లయింగ్స్వాడ్స్, 63 మంది రిటర్నింగ్ అధికారులు, 353 మంది పోలింగ్ ఆఫీసర్లు, 359 మంది అసిస్టెంట్ పో లింగ్ ఆఫీసర్లు, 1,070 మంది పోలింగ్ క్లర్క్‌లను నియమించారు. 620 బ్యాలెట్ బాక్సులు సహా 2,10,000 బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో వార్డుకు 50 చొప్పున 2,000 పోస్టల్ బ్యాలెట్లను ఉంచారు.
భద్రత కట్టుదిట్టం
ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాం. ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాం. ఎన్నికల్లో అక్రమాలు జరుగకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు భద్రతతో కూడిన ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
– సుధీర్‌బాబు, ఫ్యూచర్‌సిటీ కమిషనర్
