షాద్‌నగర్, అక్టోబర్ 10 : షాద్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఆగమాగంగా ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని ఈ పార్టీ నియోజకవర్గంలో తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోవడం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు. ఎలాంటి గుర్తింపులేనివారు సైతం టికెట్ తమదే అంటూ ప్రచారం చేసుకుంటుండడంతో కేడర్ బిత్తరపోయి చూడాల్సి వస్తున్నది. ఆ పార్టీలో నేతలు తక్కువే ఉన్నా.. గ్రూపులు మాత్రం ఎక్కువే అని తెలుస్తున్నది. నాయకుల మధ్య సయోధ్య లేదు.. ఎవరిదారి వారిదే అన్న చందంగా ఉన్నది. గెలువని పార్టీకి ఎందుకింత.. ఏమిటీ వింత అని స్థానికులు ముచ్చటించుకుంటున్నారు.
బలమైన నేతలతో బీఆర్ఎస్ పటిష్టంగా ఉండగా.. కనీసం ఆ పార్టీకి పోటీ ఇవ్వాలన్న ఆరాటంలో కాంగ్రెస్ పార్టీ తన సైన్యంతో ఎన్నికలకు సిద్ధమవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం పరిచయం కూడా లేని బీజేపీ అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. ఒక వైపు ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేదు. ఉన్న నలుగురైన కలిసి నడుస్తారా? అంటే అది కూడా లేదు. నలుగురు నాలుగు గ్రూపులు. అయినా గెలుస్తామని ఆ పార్టీ నేతలు బీరాలు పలుకుతున్నారు. అసలు గ్రామాల్లో పరిచయం లేని పార్టీ ఎలా గెలుస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది షాద్‌నగర్‌లో బీజేపీ దుస్థితి. బీజేపీకి నియోజకవర్గంలో పట్టుమని వంద మంది కూడా ప్రధాన కార్యకర్తలు లేరు. దీనికి తోడు గ్రూపు రాజకీయాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. టికెట్ తమదంటే తమదంటూ అంటూ ప్రచారం చేసుకుంటూ తమకు తోచిన విధంగా చక్కర్లు కొడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. నియోజకవర్గంలో తాము కూడా పోటీలో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టికెట్ కోసం శ్రీవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య, మిథున్‌రెడ్డి పోటీపడుతున్నారు.
హ్యాట్రిక్ ఓటమి కోసమేనా..
ఓ వైపు ఈ అసెంబ్లీ నుంచి రెండు సార్లు ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రస్తుతం హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో రెండు సార్లు బీజేపీ నుంచి పోటీ చేసిన ఎన్. శ్రీవర్ధన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో కూడా డిపాజిట్ మాత్రమే దక్కించుకున్నాడు. మళ్లీ 2018 ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఈ విడుత టికెట్ ఇచ్చినా పరిస్థితి మాత్రం అంతంతే అనే ప్రచారం బలంగా సాగుతున్నది.
అందె వేసిన చేయి
అవసరాన్ని బట్టి పార్టీలను మార్చడంలో అతనిది అందె వేసిన చేయి. అతను ఎవరో కాదు పేరులోనే అందె పెట్టుకున్న అందె బాబయ్య. ఒకప్పుడు టీడీపీలో ఉన్న ఆయన తరువాత బీఆర్ఎస్లో చేరారు. కొన్నేండ్ల పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనంతరం బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పార్టీలు మార్చే నాయకులకు టికెట్ ఇవ్వొద్దని ఆ పార్టీలోనే ఓ వర్గం నాయకులు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఏ రోజు కూడా సేవా కార్యక్రమాలు చేయలేదు. ప్రజల్లో కూడాఅతడికి ఏ మాత్రం పేరు లేదు. ఇలాంటి
నాయకుడికి టికెట్ ఇస్తే ఎలా? అని, ఒకవేళ ఇస్తే మాత్రం ముందుగానే ఓటమిని ఒప్పుకున్న వారవుతామని బీజేపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
చీరలు, పాల పౌడర్లు పంచుతూ..
విష్ణువర్ధన్‌రెడ్డి బీజేపీలో ఎలాగైన టికెట్ సాధించాలన్న ఉత్సాహంతో గ్రామాల్లో చీరలు, పాల పౌడర్లు పంచుడు వంటి కార్యక్రమాలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో తన ప్రచారం చేసుకుంటున్నాడు. ఇతడికి ఆ పార్టీ అధిష్టానంలో ఎలాంటి గుర్తింపు లేదని ఆ పార్టీ కార్యకర్తలే మాట్లాడుకోవడం విశేషం. రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు అక్రమంగా డబ్బులు సంపాదించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుంటే శ్రీవర్ధన్‌రెడ్డి మాత్రం హ్యాట్రిక్ పరాజయం కోసం తపిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.
వరుసలో స్థానికేతరుడు
యువ నాయకుడి పేరు మిథున్‌రెడ్డి. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు. నిజానికి మిథున్‌రెడ్డికి షాద్‌నగర్ నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. మాజీ ఎంపీ మాత్రం కొన్నేండ్ల్లపాటు ఎంపీగా పనిచేశారు. అయినప్పటికీ మిథున్‌రెడ్డిని మాత్రం గ్రామాల్లో ఎవ్వరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక్కడ స్థానికులకే దిక్కులేదు స్థానికేతరులకు టికెట్ ఎలా ఇస్తారని బీజేపీ నాయకులే ప్రశ్నిస్తున్నా రు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా కనీసం డిపాజిట్ అయి నా దక్కుతుందా? అని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకోవడం గమనార్హం