రంగారెడ్డి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన టౌన్‌ప్లానింగ్ (టీపీవో) వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలుండగా అవి అన్ని ఇన్‌చార్జీలతో సాగుతున్నాయి. ఒక్కో టౌన్‌ప్లానింగ్ అధికారి మూడు నుంచి నాలుగు మున్సిపాలిటీలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ అధికారి మున్సిపాలిటీలకు ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. బిల్డ్ నౌ యాప్ ద్వారా భవన నిర్మాణాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి 21 రోజుల్లోపు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, టీపీవోల కొరతతో అనుమతులు సకాలంలో రావడం లేదని దరఖాస్తు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇండ్లు, వాణిజ్య భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.
జిల్లాలో షాద్‌నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు మున్సిపాలిటీలున్నాయి. ఈ ఆరు మున్సిపాలిటీలకు ఇన్‌చార్జీలే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. షాద్‌నగర్ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి కరీంనగర్ నుంచి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన వారానికి ఒకటి రెండు రోజులు కూడా షాద్‌నగర్‌కు రావ డం లేదనే ఆరోపణలున్నాయి. శంకర్పల్లి మున్సిపాలిటీకి సదాశివపేట టౌన్‌ప్లానింగ్ అధికారి కొనసాగుతున్నారు.
ఆయన శంకర్‌పల్లికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది. అలాగే, మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లి టౌన్‌ప్లానింగ్ అధికారి ఉండగా.. ఆయన మొయినాబాద్, చేవెళ్ల, కొంపల్లితోపాటు అదనంగా మరో మున్సిపాలిటీకి కూడా ఇన్చార్జిగా కొనసాగుతున్నట్టు సమాచారం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ఆదిబట్ల సర్కిల్ టీపీవో ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన ఇబ్రహీంపట్నంతోపాటు ఆదిబట్ల, కొంగరకలాన్, తుర్కయాంజాల్, తొర్రూరు వార్డులకు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆమనగల్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి.. నాగర్‌కర్నూల్, కల్వకుర్తితోపాటు ఆమనగల్లు మున్సిపాలిటీకి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
టీపీవోల కొరతతో భవన నిర్మాణాల అనుమతులకు తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నిబంధనల మేరకు జీ ప్లస్-2కు అనుమతులు తీసుకుని, అదనంగా మరో మూడు నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు. మరికొందరు రిసార్టులు, మినీ ఫంక్షన్ హాళ్లను నిర్మి స్తున్నా ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. అక్రమ నిర్మాణదారులకు టీపీవోల అండదండలు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వారి ద్వారా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నట్టు వినికిడి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతోపాటు కొంగరకలాన్, ఆదిబట్ల, తుర్కయాంజాల్, తొర్రూరు వార్డుల పరిధుల్లో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయని.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపణలున్నాయి.
జిల్లాలోని మున్సిపాలిటీలతోపాటు నగర శివారులో జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. అలాగే, టౌన్‌ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవకతవకలపై దృష్టిసారించి, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పత్తాలేరని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.