శంకర్పల్లి, జులై 19 : శంకర్పల్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిధిలో గల ఫతేపూర్ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని శంకర్పల్లి మాజీ ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విజిట్ కోసం శంకర్పల్లి నుండి కాజిపేట్ రైల్వే స్టేషన్‌కి వెళ్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతి పత్రం ఇచ్చారు. అందులో భాగంగా ఫతేపూర్ ఎక్స్ రోడ్డు బ్రిడ్జి కింద వర్షానికి భారీగా నీరు నిలుస్తుండటంతో గ్రామస్తులు అలాగే రోడ్డు వెంట వెళ్లే రహదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి పరిష్కారంగా రైల్వే ట్రాక్ కింద నుంచి మూసీకి ఆ వర్షపు నీరు వెళ్లే విధంగా పైప్ లైన్ వేయాలని కోరారు. ఫతేపూర్ రైల్వే గేట్ మూసివేసినందుకు గ్రామంలో ఎవరు చనిపోయిన స్మశాన వాటికకు దారి లేకుండా పోయింది. రైల్వే ట్రాక్ మీద నుంచి శవయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి పరిష్కారంగా రైల్వే గేట్ పునరుద్ధరించాలని కోరారు. ఫతేపూర్ గ్రామస్తులకు రైల్వే ట్రాక్ అవతల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ భూములకు వెళ్లడానికి దారి లేకుండా పోయింది. కావున రైల్వే ట్రాక్ ఏర్పడినప్పుడు రైతుల దగ్గర సేకరించిన భూమిలో నుంచి 20 ఫీట్ల దారి రైతులకు వెళ్లడానికి ఇవ్వాలని కోరారు.