కందుకూరు, యాచారం మండలాల్లో సుమారు 19,000 ఎకరాలను ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం సేకరించింది. పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత ఫార్మాపై స్పష్టమైన ప్రకటన రావడం లేదు. మరోవైపు ఫార్మాసిటీ సమీపంలోనే ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఫార్మాసిటీ ఏర్పాటవుతుందా..? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎలిమినేడులో ఏరోస్పేస్ ఏర్పడేనా..?
ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో టాటా అనుబంధమైన ఏరోస్పేస్ ఏర్పాటుకు గత ప్రభుత్వం బీజం వేసింది. ఈ గ్రామంలోనే మహేంద్ర కంపెనీ ఏర్పాటుకు కూడా ఆ సంస్థ ముందుకు రాగా..రైతులు ఆశించిన పరిహారం ఇచ్చి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని టీఎస్ఐఐసీకి అప్పగించింది. పరిశ్రమల ఏర్పాటుకు అంతా సిద్ధం కాగా.. ఆ సమయంలో ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ఎలిమినేడుకు ఏరోస్పేస్ సంస్థ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆశించిన వారి ఆశలపై నీల్లు చల్లినట్లయ్యింది. ఈ గ్రామానికి ఏరోస్పేస్, మహేంద్ర సంస్థలు వస్తాయా..? రావా ..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
నిరుద్యోగులకు వరం ఫాక్స్‌కాన్
మాజీ సీఎం కేసీఆర్ పట్టుబట్టి తీసుకొచ్చిన ఫాక్స్‌కాన్ కంపెనీ ఈ ప్రాంత నిరుద్యోగులకు వరంగా మారింది. గతేడాది మే 9న ఈ కంపెనీ తన పనుల ను ప్రారంభించింది. మార్చి నాటికి మొదటి దశ పూర్తి కావాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పనుల్లో కొంత జాప్యం జరిగింది. అయినప్పటికీ ఆ కంపెనీ ప్రతినిధులు శరవేగంగా పనులు చేపడుతున్నారు. మరో నెల రోజుల్లో మొదటి దశ పనులను పూర్తిచేసి ప్రొడక్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయిం చారు.
ఇందుకోసం మొదటి దశలో 25వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు ఇబ్రహీంప ట్నం, మహేశ్వరం సెగ్మెంట్లలో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారిని ఎంపిక చేసి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో ఉద్యోగమేళాలూ నిర్వహించారు. రూ.450 కోట్లతో ఫాక్స్‌కాన్ కంపెనీని ఏర్పాటు చేశారు.
పరిశ్రమలుఏర్పాటు చేయాలి
బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏరోస్పేస్‌తోపాటు మరిన్ని సంస్థలను ఎలిమినేడు గ్రామానికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వం ఆ పరిశ్రమలను ఏర్పాటు చేసిన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
– మంచిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ, ఇబ్రహీంపట్నం
పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోని సర్కార్
అభివృద్ధిలో వెనుకబడిన మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడలో పరిశ్రమల ఏర్పాటు కోసం
400 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి.. అక్క డ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించగా.. ప్రస్తుత సర్కారు దానిపై దృష్టి సారించడం లేదు. అలాగే, యాచా రం మండలంలోని మొండిగౌరెల్లిలోనూ పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం అప్పట్లోనే 400 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి సర్వేకూడా చేశా రు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తారామతిపేటలో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూ మిని పరిశ్రమల కోసం గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. ప్రభుత్వం మారడంతో అవి అన్నీ బుట్టదాఖలయ్యాయి. కందుకూ రు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి వంటి మండలాల్లోనూ సర్కారు చేయిచ్చింది.
ఫాక్స్ కాన్తో నిరుద్యోగ యువతకు ఉపాధి
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్ కంపెనీతో చాలామంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించాయి. మరిన్ని ఉద్యోగాల భర్తీకోసం ఆ కంపెనీ గ్రామాల్లో నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నది. ఈ ప్రాంతంలో ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటుకు కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి
కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మడుపు శివసాయి