సిటీబ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్ సిటీ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంతో ఆర్భాటంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పట్లో ముందడుగు పడే పరిస్థితులు కనబడటంలేదు. ఇందుకు భూ సేకరణకు వెంటాడుతున్న కష్టాలే కారణమని చెప్పకతప్పదు. వాస్తవంగా ఫ్లై ఓవర్లు..ఆర్వోబీ..ఆర్‌యూబీలు, రహదారులు, నాలాల విస్తరణ..లింకు రోడ్లు..అభివృద్ధి ఏదైనా సకాలంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే భూసేకరణ అత్యంత కీలకం. ఆయా ప్రాజెక్టు వ్యయం ఎంత ఖర్చవుతుందో.. భూ సేకరణకు అంతేస్థాయిలో వ్యయం అవుతుంది. ఆస్తుల సేకరణలో జీహెచ్ఎంసీ మొదటినుంచి లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నది. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభం సమయంలోనే దాదాపు ఆస్తుల స్వాధీనంలో పై చేయిగా ఉండాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ భూసేకరణపై స్పష్టత లేకుండానే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయడం అధికారుల పనితీరుకు నిదర్శనం. ఈ నేపథ్యంలోనే ఆస్తుల సేకరణకు రూ.760 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ఈ నిధుల మంజూరుకు సర్కార్ వైపు దీనంగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఖజానాలో నిధులు లేకపోవడం.. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుండడం.. వెరసి నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తే గానీ ప్రాజెక్టులకు అంగీకరించే పరిస్థితి కనిపించడంలేదు. ప్రాజెక్టు విభాగం అధికారులు మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి టెండర్ల ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేస్తుండడం విశేషం.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం రోజురోజుకూ మరింత జఠిలంగా మారుతున్నది. రోడ్డు విస్తరణలో భాగంగా తమ ఇంటి స్థలాలను కోల్పోతున్న వారి నుంచి తీవ్రమైన ప్రతిఘటన వ్యక్తం కావడం.. న్యాయపరమైన చిక్కులు పెరుగుతుండడంతో.. ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భూసేకరణ నిలుస్తున్నది. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు ఇతర బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఆస్తుల స్వాధీనం అధికారులకు తలనొప్పిగా మారుతుండగా.. వరుస కోర్టు వివాదాలతో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేని సమస్యగా మారుతున్నది.
హెచ్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా రూ.7032 కోట్ల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయగా.. ఇందులో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారి విస్తరణ పనులున్నాయి. 38 ప్రాజెక్టులు ఉండగా 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, మూడు ఆర్‌యూబీలు, పది చోట్ల రహదారి విస్తరణ పనులకుగానూ కొన్నింటికి టెండర్లు పిలిచారు. వచ్చే రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంజినీర్లు చెబుతున్నారు. భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు పరిహారం ముందుగా చెల్లించాల్సి ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్డీపీ ద్వారా 47 ప్రాజెక్టులు చేపట్టి 36 ఫ్లై ఓవర్లతో అనతికాలంలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను చేపట్టినప్పుడు నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా ట్రాన్స్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) ద్వారా పరిహారం అందించారు. దాదాపు రూ.3700 కోట్ల పైచిలుకు టీడీఆర్ బాండ్స్ భూ నిర్వాసితులకు జీహెచ్ఎంసీ అందజేసింది. దీంతో రూ.3700 కోట్ల మేరకు భారీ మొత్తంలో వ్యయానికి సంబంధించిన భారం తప్పింది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ పరిహారానికి నిర్వాసితులు మొగ్గుచూపే పరిస్థితి లేదు. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలో టీడీఆర్‌లకు ససేమిరా అంటున్నారు.