షాద్‌నగర్ : పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలన్నదే నా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం తనవంతుగా చిత్తశుద్ధితో పని చేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడ, నాగులపల్లి, చిన్న చిల్కమర్రి, చిలకమర్రి, కాశిరెడ్డిగూడ, కుందేలుకుంట, నేరళ్లచెరువు, మధురాపూర్, గంట్లవెల్లి, దేవునిబండ తాండ, కమ్మదనం గ్రామాల్లో సీసీరోడ్డు పనులకు శంకుస్థాన చేసిన సందర్భంగా మాట్లాడారు. గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని తెలిపారు.
13 గ్రామాల్లో సీసీ రోడ్లను నిర్మించేందుకు రూ. 1.84కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రతి పల్లెకు బీటీ రోడ్డు, ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా వంటి వసతులు వచ్చాయని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే రైతుబంధు, రైతుబీమా, కల్యాన లక్ష్మీ, ఆసర పింఛన్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు పేద ప్రజలకు ఎంతో భరోసాను ఇస్తున్నాయని తెలిపారు. అదే విధంగా తాజాగ వెనుకబడిన దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకం అందుబాటులోకి వచ్చిందని, ప్రతి లబ్ధిదారుడికి రూ. 10లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.
ఇది ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం పై ఆయా ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, రైతు సమితి మండల కన్వీనర్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.