Shadnagar | షాద్‌నగర్ టౌన్, ఏప్రిల్ 19: షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీలోని 7, 8వ వార్డుల్లో సీసీ రోడ్డు, అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. పట్టణ ప్రజలకు అవసరమయ్యే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు సంబంధించిన కాలనీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అదే విధంగా వేసవికాలం దృష్ట్యా పట్టణంలో ఎక్కడ ఎలాంటి నీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. పట్టణాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వార్డుల్లో, కాలనీల్లో ఎలాంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ చైర్మన్ విశ్వం, మాజీ కౌన్సిలర్లు కృష్ణవేణి, శాంతమ్మ, నాయకులు చెన్నయ్య, విజయ్‌కుమార్, శ్రీశైలం, మురళీమోహన్, శ్రీధర్, గంగిరెడ్డి, ఇబ్రహీం, ప్రవీణ్, మోహన్, నీరటి వాసు పాల్గొన్నారు.