Shabad | షాబాద్, ఏప్రిల్ 22 : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ కాంతారెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో ఎస్ఐ రమేశ్‌తో కలిసి ప్రజలకు సైబర్ నేరాలపై, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మైనర్లకు వాహానాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువకులు త్రిబుల్ రైడింగ్, అతి వేగంగా వాహానాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో పేకాట ఆడితే తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని సూచించారు.
ఆన్లైన్ బెట్టింగ్‌ల మోజులో పడి మోసపోవద్దని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. శాంతియుత వాతావరణంలో జీవనం సాగించాలన్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి కేసులు పెట్టుకుని ఇబ్బందులు పడవద్దని సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానీసలు కాకుండా మంచి మార్గంలో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, పోలీసు సిబ్బంది తదితరులున్నారు.