షాబాద్ : జిల్లాలోని బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో వరదనీటి నుంచి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 82కోట్ల నిధులను విడుదల చేశారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎం నేతృత్వంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని తెలిపారు. సంక్రాంతి కానుకగా నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ప్రజలందరి తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. వర్షకాలం వస్తే ప్రజలు ఎదుర్కొనే సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.