తాండూరు రూరల్ : వారం రోజులుగా రెండు గ్రామాల ప్రజలు నీటి కోసం ( Drinking Water Problems) నానా అవస్థలుపడుతున్నారు. మండల అధికారులు,ఆర్డబ్ల్యుఎస్ ( RWS) అధికారులు నీటి సరఫరా చేయలేక చేతులేత్తాశారు. మిషన్ భగీరథ( Mission Baghirath) నీళ్లు బంద్ కావడంతో ప్రజలకు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. గతంలో సీఎం కేసీఆర్ ( KCR) చొరవ కారణంగా మిషన్ భగీరథ పథకం ద్వారా 50 ఏళ్ల నీటి సమస్య తీరింది. కాంగ్రెస్ పాలనలో మంచినీటిని కూడా ప్రజలు ఇవ్వలేకపోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు మండలం, సంకిరెడ్డిపల్లి పంచాయతీతోపాటు అనుబంధ గ్రామమైన సంకిరెడ్డిపల్లి తండాలోని గిరిజనులకు వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయాయి. గ్రామంలోని బోర్లు వట్టిపోయాయి. ఇటీవల రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. దాంతో దిక్కుతోచని గ్రామాల ప్రజలు వ్యవసాయ బోర్లపై నీటి కోసం ఆధారపడ్డారు. ఉదయం లేవగానే వ్యవసాయ బోర్ల వద్దకు క్యూ కడుతున్నారు. ఆర్డబ్ల్యుఎస్ ఏఈ ప్రణీత్, పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జు తమ గోడు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల నుంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా, అధికారుల నుంచి సమాధానం రావడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కావాలి జగదీష్ తన సొంత నీటి ట్యాంకర్ ద్వారా సంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నాడు. సంకిరెడ్డిపల్లి తండాకు జనుముల నందు తమ వ్యవసాయ బోరు నుంచి డైరెక్టుగా తండాలోకి పైపులైన్ ద్వారా గిరిజనులకు నీరు సరఫరా చేస్తు దాహార్తిని తీరుస్తున్నాడు.
గ్రామాన్ని సందర్శించిన ఆర్డబ్ల్యుఎస్ ఏఈ ప్రణీత్
ఆర్డబ్ల్యుఎస్ మండల ఏఈ ప్రణీత్తోపాటు పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున్ బుధవారం సంకిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. దారునవాగుతండా నుంచి నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంచాయతీలో చిల్లిగవ్వకూడా లేదని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేశారు. నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.