వికారాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : లంచమిస్తేనే పనులు చేస్తున్నారని జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాలకెళ్లే వారిని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట లంచం తీసుకుంటూ కొందరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నా ఆఫీసర్ల తీరులో మాత్రం మార్పు రావ డం లేదని పలువురు పేర్కొంటున్నారు.
కొందరు తహసీల్దార్లు భూభారతి దరఖాస్తులను ఆసరాగా తీసుకొని అందిన కాడికి దండుకుంటుంటే.. మరికొందరు ఏకంగా రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములకే ఎసరు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అక్రమార్కులతో చేతులు కలిపి రికార్డులను తారుమారు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పరిగి నియోజకవర్గంలోని పరిగి, పూడూరు తహసీల్దార్లపై తీవ్ర ఆరోపణలు వస్తుండడం గమనార్హం. పలువురు అవినీతి తహసీల్దార్ల వసూళ్ల బాగోతంపై కలెక్టర్ సీరియర్‌గా ఉన్నారు.
వారిని బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ఓ స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో అవినీతి తహసీల్దార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను పీడిస్తున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజానీకం ఉన్నతాధికారులను కోరుతున్నది. కాగా, పరిగి తహసీల్దార్‌పై వస్తున్న ఆరోపణలపై అదనపు కలెక్టర్ విచారణ చేపట్టారు.
అక్రమార్కులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు..
పరిగి మండలం, రంగంపల్లి గ్రామ పరిధిలోని 146 సర్వేనంబర్‌లోని ఎకరం ప్రభుత్వ భూమిని తహసీల్దార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలున్నాయి. కాగా, ఆ సర్వేనంబర్‌లో 4 ఎకరాల 17 గుంటల భూమి ఉండగా.. రికార్డుల్లో ఖారీజ్ ఖాతా(సర్కారీ భూమి)గా ఉన్నది. ప్రభుత్వ భూమిని అమ్మడం, కొనడం నిషేధమైనా తహసీల్దార్ అక్రమార్కులతో కుమ్మక్కై గతేడాది సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ చేశారని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, ఆ భూమిని కొన్న వ్యక్తి మరొకరికి విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకోగా అక్రమ రిజిస్ట్రేషన్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతమున్న తహసీల్దారే గతేడాది ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కొసమెరుపు. అయితే ఏడాది కిందట రిజిస్ట్రేషన్ బాధ్యతలు తహసీల్దార్‌కు ఉండగా, ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌కు జిల్లా ఉన్నతాధికారులు అప్పగించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ భూమిని అమ్మేందుకు ప్రయత్నించగా డిప్యూటీ తహసీల్దార్ కనిపెట్టారు.
కాగా, నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుండదు, అయితే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించారా..? లేదా అనేది జిల్లా ఉన్నతాధికారుల విచారణలో తేలనున్నది. అదేవిధంగా ఆ గ్రామంలోని సర్వేనంబర్ 256లో సుమారు 20 ఎకరాల సీలింగ్ భూమి ఉండగా, అందులో కొంతభూమిని పేదలకు ప్రభుత్వం అసైన్ చేసింది. మిగతా భూమి అంతా చెట్లు గుట్టలుగా ఉన్నది. సంబంధిత సర్వేనంబర్‌లోని సుమారు 16 ఎకరాల సీలింగ్ భూమిని కూడా పరిగి తహసీల్దార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
గతంలో దుద్యాల తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలోనూ గౌరారం గ్రామానికి చెందిన ఓ రైతు మరణిస్తే కుమారుడి పేరిట విరాసత్ చేయకుండా వేరే వ్యక్తుల పేరిట చేసినట్లు ప్రజాసంఘాల నేత లు ఆరోపిస్తున్నారు. పరిగి తహసీల్దార్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు జిల్లా అంతటా ఆయన చేసిన అక్రమాలపై పూర్తి విచారణ జరిపి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా నిరసన వ్యక్తమవుతున్నది. అయితే ఓ ప్రజాప్రతినిధి అండతోనే తహసీల్దార్ అడ్డూఅదుపూ లేకుం డా వ్యవహరిస్తున్నాడనే ప్రచారమూ జరుగుతున్నది.
లంచమిస్తేనే భూమిని ఆన్లైన్ చేస్తారంటా..!
తన భూమిని ఆన్లైన్ చేయమని బంట్వా రం తహసీల్దార్‌ను అడిగితే లంచం ఇస్తేనే చేస్తామని చెప్పుతున్నారని బంట్వారం మండలంలోని నాగారంతండాకు చెందిన రాజు అనే రైతు ఆరోపించారు. 1993లో మా తాతయ్య ఐదు ఎకరాల భూమిని కొన్నారని.. ఆయనకు ఐదుగురు కొడుకులుండగా.. నలుగురు కుమారుల పేరిట ఎకరం చొప్పున విరాసత్ కాగా మరో కుమారుడి పేరిట ఉండాల్సిన ఎకరా భూమి ఇతరుల పేరిట ఆన్లైన్లో ప్రత్యక్షమైందన్నారు.
మా తాతయ్య భూమిని కొన్నప్పటి నుంచి మేము కబ్జాలోనే ఉన్నామని, మా పేరిట ఉన్న భూమిని ఇతరుల పేరిట చేశారని.. దానిని మార్చాలని గత కొన్నేండ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నాడు. అన్ని డాక్యుమెంట్లున్నా.. రికార్డులను తారుమారు చేసి వేరే వారి పేరిట మా భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ చేసేందుకు చలాన్ చెల్లించి తహసీల్దార్ వద్దకు వెళ్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌కు విన్నవించినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పరిగి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలి
బొంరాస్‌పేట : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిగి తహసీల్దార్ ఆనంద్‌రావుపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రజాసంఘాల నాయకులు అధికారులను హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బుస్స చంద్రయ్య, కొత్తూరు చంద్రయ్య తదితరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిగి మండలంలోని రంగంపల్లి గ్రామానికి చెందిన ఎకరం ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ఆ గ్రామంలోని 20 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు కట్టబెట్టుతున్నారని ఆరోపించారు.
గోవిందాపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 95లో 16 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ.. మట్టి వ్యాపారులతో కుమ్మక్కైన పరిగి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గత నెల 25న కలెక్టర్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయగా.. దీనిపై ఆయన విచారణ అధికారిని నియమించారని.. తొమ్మిది రోజులు గడుస్తున్నా ఆ అధికారి కలెక్టర్‌కు నివేదికను అందించడంలో నిర్ల క్ష్యం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా అవినీతి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.