రంగారెడ్డి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన తమ దరఖాస్తులను ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలనే తిరస్కరించిందని పలువురు ఫార్మా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వారు యాచారం మండలం, మేడిపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫార్మా బాధిత రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి.. అందుకోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పి తమతో ఓట్లు వేయించుకుని.. అధికారంలోకి రాగానే ఆ హామీని పూర్తిగా విస్మరించి, తమను మోసం చేసిందన్నారు.
తమకు జరిగిన అన్యాయం, ధోకా విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తామంతా కలిసి పదిమంది రైతులతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్లు వేయించామన్నారు. ప్రభుత్వం ఫార్మా రైతులు నామినేషన్లు దాఖలు చేయకుండా అనేక అడ్డంకులు సృష్టించిందని.. సర్టిఫైడ్ ఎలక్ట్రోరల్ రూల్స్ ఇచ్చేందుకు మూడు రోజులపాటు ఇబ్బంది పెట్టిందని గుర్తుచేశారు. చివరకు రైతులమంతా సర్టిఫికెట్ ఇచ్చేవరకు ఆర్డీవో కార్యాలయం నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చోవడంతో చేసేదేమీలేక ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చిందన్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని ఫార్మా రైతులు ఈ నెల 21న నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఫార్మా రైతులు పోటీలో ఉంటే ఎన్నికలో ఓడిపోవడంతోపాటు పలు ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ప్రభుత్వం వారి నామినేషన్లను రిజెక్టు చేయించిందన్నారు. తమ నామినేషన్లను ఎందుకు తిరస్కరించారో చెప్పాలని అధికారులను ప్రశ్నిస్తే.. మీరిచ్చిన అఫిడవిట్లో కొన్ని ఖాళీలను పూరించలేదని సమాధానం చెప్పి దాటవేశారని.. ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఫార్మా రైతులను పోటీ నుంచి తప్పించిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఇచ్చిన అఫిడవిట్లో.. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ఇచ్చిన అఫిడవిట్లో చాలావరకు ఖాళీలను పూరించలేదని.. అయినా వారి నామినేషన్లను ఎందుకు తిరస్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాము జనరల్ అబ్జర్వర్‌కు, న్యూఢిల్లీలోని చీఫ్ ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఒక పక్క రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చెప్తుండగా.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాలకు చెందిన ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులున్నారు.