ఆమనగల్లు, (మాడ్గుల) అక్టోబర్ 19 : మండలంలోని నాగిళ్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ఆదివారం తెలంగాణ భవన్ లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు పలు పార్టీల నాయకులూ గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. 22 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేదని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని.. అందరం కలిసికట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య, సీనియర్ నాయకులు విక్రం, ఆంజనేయులు, ఇతర నాయకులు న్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవితేజ, మాజీ సర్పంచ్ నర్సింహ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సుభాశ్, నాయకులు చలమంద, మహేశ్, రాము లు, వరుణ్, చెన్నయ్య, మహేశ్, యాదయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.