షాబాద్, మే 11 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక తెలిపారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. శనివారం రాజేంద్రనగర్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో డీసీపీ శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని.. ఓటరు కార్డు లేనిచో ఈసీ నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని వెంట తెచ్చుకుని ఓటువేయొచ్చన్నా రు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుందని.. వాస్తవానికి ప్రతిసారీ సాయంత్రం 5గంటల వరకే పోలింగ్ గడువు ముగిసేదని.. ఈసారి దానిని మరో గంటపాటు ఈసీ పొడిగించిందన్నారు. ఓటర్లకు 99. 23% మేర ఓటరు స్లిప్పులను బీఎల్వోల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారన్నారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచే నిఘాను పటిష్టం చేశామని.. నిఘా బృందాల సంఖ్యను రెట్టింపు చేసి తనిఖీలను ముమ్మరం చేశామని కలెక్టర్ చెప్పారు.
నిశ్శబ్ద వ్యవధి(స్రైలెన్స్ పీరియడ్)గా పరిగణించబడిన పోలింగ్‌కు 48గంటల ముందు ప్రచార కార్యక్రమాలు నిషేధమన్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లుండ గా.. 2877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్లకు అన్ని వసతులు కల్పించామని.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరిపేలా ఏర్పాట్లు చేశామన్నారు. బరిలో 43 మంది అభ్యర్థులు ఉన్నందున పోలింగ్ కోసం మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలిం గ్ కేంద్రాల సంఖ్య కంటే 25శాతం అదనంగా లెక్కిస్తూ(రిజర్వు)బ్యాలెట్ యూనిట్లు 10757, కంట్రోల్ యూనిట్లను 3591 కేటాయించడం జరిగిందని, వీవీప్యాట్లు 4008 కేటాయించామన్నారు. ఆదివారం సాయంత్రం అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సామగ్రితో చేరుకుంటారన్నారు. శేరిలింగంపల్లి సెగ్మెంట్‌కు సంబంధించి జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మహేశ్వరం సెగ్మెంట్‌కు సంబంధించి గుర్రంగూడలోని స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో, రాజేంద్రనగర్ సెగ్మెంట్‌కు సంబంధించి రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, బండారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, వికారాబాద్ సెగ్మెంట్‌కు వికారాబాద్‌లోని మేరీ నాట్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, తాండూరు సెగ్మెంట్‌కు సంబంధించి తాం డూరులోని సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పరిగి సెగ్మెంట్‌కు సంబంధించి పరిగి మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భద్రత కట్టుదిట్టం..
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సెక్టార్ ఆఫీసర్లు, పోలీసు బృందాలతో కూడిన టీంలు, క్విక్ రెస్పాన్స్ టీంలు, ఏసీ పీల స్థాయిలో స్ట్రెకింగ్ ఫోర్సు, డీసీపీ, సీపీ, ఏడీజీ స్థాయుల్లో పర్యవేక్షణ ఉంటుంద న్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు చేవెళ్ల లోక్‌సభ పరిధి లో రూ.10,70,16,937 నగదు, రూ.1,76,12,006 లక్షల విలువ చేసే మద్యం, రూ.5,05,03,026 విలువ చేసే 1,84,68,203 కిలోల గంజాయి, రూ.31,14, 44,388 విలువ చేసే బంగారు, రూ. 30,34,700 విలువ చేసే సిల్వర్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. శనివారం సాయంత్రం 6గంటల అనంతరం బహిరంగ ప్రచారం నిషేధమని.. స్థానికేతరులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపొచ్చు
ఈ నెల 13న జరగనున్న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే టప్పుడు 13 రకాల కార్డులలో ఏదైనా ఒకదానిని తమ వెంట తీసుకువెళ్లాలని రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు కార్డు, ఆధార్‌కార్డు, ఉపాధిహామీ జాబ్‌కార్డు, ఫొటోతో ఉన్న పోస్ట్ ఆఫీస్/బ్యాంకు పాస్‌బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, లేబర్ గుర్తింపు కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్, ఫొటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు తదితర వాటిలో ఏదైనా ఒకదానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.