గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదల్చడంలేదు. దీంతో గ్రామపంచాయతీల నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడింది. గ్రామాల్లో పైపులైన్ల మరమ్మతులు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, బ్లీచింగ్ పౌడ్ర్, ఫినాయిల్ వంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం కోసం అప్పులు చేసి మరీ పనులు చేస్తున్నారు.
చేసిన అప్పులు తీర్చడం కోసం బిల్లులు సమర్పించినప్పటికీ ట్రెజరీల్లో ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కరించకపోతే కార్యదర్శులదే బాధ్యతని అధికారులు చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితిలో తమ గ్రామాలకు చెడ్డపేరు రావద్దన్న ఉద్దేశంతో కార్యదర్శులు తమ వేతనాలను సైతం గ్రామాలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది కార్యదర్శులు చేసిన అప్పులు తీర్చలేక చేతులెత్తేస్తున్నారు.
– రంగారెడ్డి, మే 25 (నమస్తే తెలంగాణ)
గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి కింద ప్రతినెలా వచ్చే నిధులు కూడా ఆగిపోయాయి. దీంతో గ్రామాలకు పన్నుల వసూళ్లు తప్పా.. ఎలాంటి నిధులు రావడంలేదు. వివిధ రిజిస్ట్రేషన్లు, టాక్స్‌ల ద్వారా వచ్చే పంచాయతీ నిధులను కేవలం పారిశుధ్య సిబ్బంది, కార్యాలయ సిబ్బందికి మాత్రమే సరిపోతున్నాయి. ఇతరత్రా పనుల కోసం వెచ్చించిన పనులకు నిధులు రావడంలేదు. పంచాయతీల్లో నిధులున్నప్పటికీ ప్రభుత్వం ఇతరత్రా పనులకు నిధులను విడుదల చేయడంలేదు. ఈ పరిస్థితిలో గ్రామపంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించి టాక్స్‌ల వసూళ్లను కార్యదర్శులు గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఖాతాల్లో జమ చేసిన డబ్బులు తిరిగి చెల్లించవద్దని ప్రభుత్వం ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ట్రెజరీలు కేవలం పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు తప్పా ఏ ఇతర బిల్లులకు కూడా చెల్లింపులకు అనుమతి ఇవ్వడంలేదు. దీంతో చెత్త సేకరణ ట్రాక్టర్ల నిన్వహణ కూడా భారంగా మారింది. దీంతో పలుచోట్ల ట్రాక్టర్లు డీజిల్ లేక మూలనపడ్డాయి. గత ఆరు నెలలుగా పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించకపోవడంతో వారు కూడా ఆందోళన బాట పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 21 మండలాలు 531 గ్రామపంచాయతీలున్నాయి. వీటిలో కడ్తాల్, కొందుర్గు, కేశంపేట, మాడ్గుల, మంచాల, నందిగామ, తలకొండపల్లి, యాచారం వంటి మండలాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు కావడం వలన పన్నులు కూడా అంతంత మాత్రంగానే వసూళ్లవుతున్నాయి. ఈ గ్రామాలకు ఎలాంటి నిధులు చెల్లించకపోవడం వలన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పంచాయతీ కార్యదర్శులు అతి భారంగా వీటి నిర్వహణ భారాన్ని భుజాలపై వేసుకుని మోస్తున్నారు.
ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టడంలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీల ప్రత్యేకాధికారులు పత్తా లేకుండా పోయారు. దీంతో వచ్చే నెల రోజుల్లో సీజనల్ వ్యాధుల సమస్య తీవ్రంగా ఉండనున్నందున వెంటనే గ్రామీణ ప్రాంతాలవారికి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.