సీజనల్ వ్యాధులు జిల్లాను కుదిపేస్తున్నాయి. గ్రామాల్లో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పట్టణాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పిదాలతో ప్రస్తుతం జిల్లా మొత్తం జ్వరంతో ఇబ్బందిపడుతున్నది. వర్షాకాలం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ముందస్తుగా బ్లీచింగ్ పౌడర్ సరఫరా, ఫాగింగ్ వం టివి నిర్వహించలేదు. డ్రైనేజీల్లో పూడిక తీయడం, గ్రామాల్లో నీరు నిల్వ గుంతలు పూడ్చడం చేయలేదు. దీంతో డెంగీతోపాటు మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి.
– రంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)
పంజా విసురుతున్న వ్యాధులు..
అసలే వానల కాలం. దీంతో ఒక్కసారిగా వ్యాధులు పంజా విసురుతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఫీవర్లు తీవ్రమయ్యాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా డెంగీ, వైరల్ ఫీవర్లు, వాంతులు, విరేచనాలు, మలేరియా వ్యాధులతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఒంటి నొప్పులు, తలనొప్పులతో మొదలై జ్వరాలకు దారితీస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా డెంగీ బాధితులే ఎక్కువగా కనిపి స్తున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 188 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కానీ.. రికార్డుల్లోకి రాని కేసులు ఇంతకు రెట్టింపేనన్నది నగ్నసత్యం. జ్వరాల తీవ్రత నేపథ్యంలో వైద్య సిబ్బంది కొద్ది రోజులుగా ఇంటింటికీ తిరి గి జ్వర సర్వే నిర్వహించి వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నారు. నెల రోజుల్లోనే 5,380 మంది జ్వర పీడితులను గుర్తించినట్లు వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు. కొన్ని పల్లె, బస్తీ దవాఖానల్లో ఇప్పటికీ డాక్టర్లే లేరు. ఖాళీలు భర్తీకి నోచుకోక కింది స్థాయి సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. దీనివల్ల ప్రజానీకానికి వైద్య సాయం అంతంత మాత్రంగానే అందుతున్నది. జ్వర పీడితుల తాకిడి ఎక్కువగా ఉండి ఓపీ అధికంగా ఉన్న దవాఖానల్లో బెడ్లు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం.
ముందస్తు చర్యలు శూన్యం..
ప్రతి సీజన్లోనూ వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల తీవ్రతను అరికట్టొచ్చు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఆ దిశగా ముందస్తు జాగ్రత్తలేవీ చేపట్టలేదు. ఇన్చార్జీల పాలనలో పంచాయతీల్లో పాలన పడకేయడంతోపాటు నిధుల కొరత వేధిస్తుండడంతో పారిశుధ్య చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.
మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తూ వ్యాధులను విస్తరింపజేస్తున్నాయి. కొన్ని రోజులుగా జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యా ధులతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధులు ప్రబలినప్పుడే హడావుడి చేసే వైద్యశాఖ.. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైంది. అటు పంచాయతీ, మున్సిపల్ శాఖలు..ఇటు వైద్యశాఖలు మొదటినుంచీ నిర్లిప్తత వహించిన కారణంగా అధికార యంత్రాంగానికి వ్యాధులు సవాల్ విసురుతున్నాయి.
పేషెంట్లు సరే.. డాక్టర్లు ఏరీ ?
కొత్తూరు దవాఖానలో ఏఎన్ఎన్తోనే వైద్యం
కొత్తూరు, ఆగస్టు 26 : కొత్తూరు మండల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలోని తిమ్మాపూర్‌లో ఇప్పటికే డెంగీతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అలర్ట్‌గా ఉండాల్సిన డాక్టర్లు ఏఎన్ఎంలతో వైద్యం చేయిస్తున్నారు. దవాఖానలో మండల వైద్యాధికారితో పాటు 5 మంది డాక్టర్లు ఉన్నారు. సోమవారం దవాఖానకు 40 మంది రోగులు వచ్చినా ఏఎన్‌ఎంతోనే రోగులు వైద్యం చేయించుకున్నారు. ఆరుగురిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం ఒకరిద్దరు డాక్టర్లు ఉన్నా మెరుగైన వైద్యం అందేదని రోగులు అభిప్రాయపడ్డారు.