వికారాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తకు నడక నేర్పినట్లు మొక్కుబడిగా సాగుతున్నది. ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించి.. అవసరమైన అధికారుల బృందాలను కూడా ఏర్పాటు చేసింది. అయినా క్షేత్ర స్థాయిలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉన్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా రెండు నుంచి మూడు నెలల సమ యం పట్టే అవకాశం ఉన్నది.
వికారాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎల్ఆర్ఎస్ (అనుమతిలేని లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించి.. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినా పరిశీలన మాత్రం మొక్కుబడిగానే సాగుతున్నది.
మున్సిపాలిటీ ల్లో పలు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాగా.. గ్రామ పంచాయతీల్లో మాత్రం ఇంకా షురూనే కాలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఈ పథకం పనులు స్లోగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అప్లికేషన్ల పరిశీలన బాధ్యతలు చూస్తున్న బృందాలకు సొంత శాఖల పనులతోపాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడంతోనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో జాప్యం జరు గుతున్నదని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు. జిల్లాలో 37,313 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో మున్సిపాలిటీల నుంచి 21,084 దరఖాస్తులు రాగా, గ్రామ పంచాయతీల నుంచి 16,229 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో జాప్యం..
మూడు నెలల్లోనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు మరో రెండు నుంచి మూడు నెలల వరకు సమయం పట్టేలా ఉన్నది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించేందుకు మున్సిపాలిటీల్లో టీపీవో(టౌన్ ప్లానింగ్ ఆఫీసర్), ఇరిగేషన్ ఏఈ, ఆర్ఐ(రెవెన్యూ ఇన్స్పెక్టర్)లతో బృందాలు, గ్రామ పంచాయతీల్లో ఆర్ఐ, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులతో కలిసి టీములను సర్కార్ ఏర్పాటు చేసింది.
అయితే జిల్లాలో నీటిపారుదల శాఖలో నలుగురు మాత్రమే ఇరిగేషన్ ఏఈలున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా టౌన్‌ప్లానింగ్ అధికారులు అవసరం ఉండగా.. కేవలం తాండూరు, వికారాబాద్ ము న్సిపాలిటీలకు మాత్రమే ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఓటరు జాబితా బాధ్యతలు, ఆర్ఐలకు ధరణి బాధ్యతలతోపాటు రెవెన్యూ ఫైళ్లకు సంబంధించి రిపోర్ట్టులివ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది.
పరిశీలన బృందాల్లో ఉన్న ఇరిగేషన్ ఏఈలకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడంతోపాటు మరోవైపు ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులకు ఇతర బాధ్యతలుండడంతో ఎల్ఆర్ఎస్పై తమ దృష్టిని సక్రమంగా కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతో ఆ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో రెండు నుంచి మూడు నెలల వరకు సమ యం పట్టే అవకాశం ఉన్నది. గ్రామ పంచాయతీల్లో 16,229 మంది దరఖాస్తులు పెట్టుకోగా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా పూర్తి కాలేదు.
వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల నుంచి 21,084 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 424 దరఖాస్తుల పరిశీలనను ప్రారంభించగా, ఒక్క దరఖాస్తూ పూర్తి కాలేదు. పరిశీలనలో భాగంగా ప్రభుత్వ భూమి, అసైన్డ్ తదితర వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రత్యేక యాప్‌లో ఎంట్రీ చేస్తున్నారు. సంబంధిత ప్లాట్ల విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ డబ్బులను లబ్ధిదారులు చెల్లిస్తున్నారు.