విద్యాసంవత్సరం ప్రారంభంలోగా మొదటి విడుత స్కూళ్లలో పనుల పూర్తికి చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రతి పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో అద్భుతంగా మారుతున్నాయి. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1338 పాఠశాలలు ఉండగా, తొలి విడుతలో 464 స్కూళ్లు ఎంపికయ్యాయి. ఇందులో 124 పాఠశాలల్లో 1026 పనులకుగాను రూ.57.30 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేయగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా 197 స్కూళ్లకు పరిపాలన అనుమతులను కూడా మంజూరు చేసింది. మిగతా స్కూళ్లలోనూ త్వరితగతిన అంచనాలు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పాఠశాలల్లో 90 శాతం పనులు పూర్తి కాగా, వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే మూడేండ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు వంటి పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. – రంగారెడ్డి, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధిక నిధులను కేటాయి స్తూ రానున్న మూడేండ్ల కాలంలో రాష్ట్రంలోని అన్ని బడులకు మహర్దశ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రంగారె డ్డి జిల్లాలో 1,338 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో మొదటి విడుతలో 464 స్కూ ళ్లలో అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నారు. కాగా ఆ పనులను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపే పూర్తి చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారులు వేగవంతం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు డిజిటల్ బోధనను అందిస్తూ కార్పొరేట్ స్కూ ళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యా హ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, డ్రెస్సులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా జిల్లాలోని 124 ప్రభుత్వ బడుల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 197 స్కూళ్లకు సంబంధించి పరిపాలన అనుమతులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే రంగారెడ్డి జిల్లాలో 1,338 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో తొలి విడుతలో వసతుల ను కల్పించేందుకు 464 స్కూళ్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో ప్రాథమిక పాఠశాలలు-261, ప్రాథమికోన్నత పాఠశాలలు- 58, ఉన్నత పాఠశాలలు-145 ఉన్నాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో 30శాతం మేర పాఠశాలలను ఎం పిక చేశారు. అంతేకాకుండా ఆయా మండలాల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న బడులను కూడా పరిగణనలోకి తీసుకొని తొలి విడుతలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. కాగా తొలి విడుత లో ఎంపికైన బడుల్లో మౌలిక వసతులను కల్పించే పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 124 పాఠశాలల్లో పనులు ప్రారంభంకాగా, మిగతా బడుల్లోనూ త్వరగా అంచనాలను పూర్తి చేసి పనుల ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలను ము మ్మరం చేశారు. జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్ ఎప్పటికప్పుడు పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ప్రారంభమైన 124 బడుల్లో చేపట్టనున్న 1026 పనులకు అంచనాలు పూర్తికాగా, సంబంధిత పనులకు రూ.57.30 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన శివరాంపల్లి, జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా చేపట్టిన పనులు 90 శాతం మేర పూర్తికాగా, ఈనెలాఖరులోగా వంద శా తం పూర్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘మన ఊరు-మన బడి ’లో భాగంగా 12 అంశాలను పరిగణనలోకి జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను రూపొందించారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్‌బోర్డులు, పెయింటింగ్, ప్రహారీలు, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు వంటి పనులను ప్రభుత్వ పాఠశాలల్లో చేస్తున్నారు.
మొదటి విడుతలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన రెండు ప్రభుత్వ బడుల్లోనూ ఇప్పటికే 90 శాతం మేర పనులు పూర్తికాగా, ఈనెలాఖరులోగా మిగిలిన పనులను పూర్తి చేస్తాం. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోపే మొదటి విడుతలో ఎంపికైన అన్ని బడుల్లోనూ మౌలిక వసతులను కల్పిస్తాం. – సుశీంద్రరావు, డీఈవో రంగారెడ్డి జిల్లా