రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల రీ ఓపెన్‌కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దుస్తుల తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అధికారులు అప్పగించారు. అయితే నిర్ణీత గడువు వరకు యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు వారిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 1,264 పాఠశాలల్లో 1,47,642 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించనున్నారు. అయితే ఇప్పటివరకు 50 శాతం మాత్రమే దుస్తులు సిద్ధం కావడంతో యూనిఫామ్స్ అందజేతపై సందేహాలు నెలకొన్నాయి.
విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతోపాటు ప్రతి విద్యార్థికీ రెండు జతల చొప్పున దుస్తులు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకులాలు, కస్తూర్బాలు, మాడల్ స్కూల్స్, సంక్షేమ పాఠశాలలు మొత్తం కలిపి 1,264 ఉండగా.. వాటిలో చదువుతున్న 1,47,642 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించేందుకు గతేడాది చివరలోనే అధికారులు కార్యాచరణను రూపొందించారు.
దుస్తులను కుట్టే బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే వారు పాఠశాలలకు వెళ్లి పిల్లల కొలతలు సైతం తీసుకున్నారు. అయితే యూనిఫామ్స్‌కు సంబంధించిన క్లాత్ గత నెల చివరన జిల్లాకు చేరడం.. దుస్తుల కటింగ్ మిషన్ల కొరత తదితర కారణాలతో గడువులోగా లక్ష్యాన్ని అందుకోవడం అధికారులకు సవాల్‌గా మారింది.
దుస్తుల తయారీని మున్సిపాలిటీల్లో మెప్మా, రూరల్ ప్రాంతాల్లో డీఆర్డీఏ పర్యవేక్షిస్తున్నది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పరిశీలిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 39 సెంటర్లలో దుస్తుల కటింగ్ పనులు జరుగుతుండగా..110 కేంద్రాల్లో మహిళా సంఘాల సభ్యులు స్టిచ్చింగ్ చేస్తున్నారు. డ్రెస్ మేకర్స్ కొరత వేధిస్తుండడం..దీనికితోడు రెండు జతల దుస్తులకు రూ.100 మాత్రమే చెల్లిస్తుండడంతో చాలామంది ముందుకు రావడంలేదు.
అయితే ప్రభుత్వం ఆ మొత్తాన్ని పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా కుట్టుమిషన్ల కొరత ఉండగా..అధికారులు అప్పటికప్పుడు కొత్త వాటిని సమకూర్చుతున్నారు. ఆదివారం నాటికి యాభై శాతం దుస్తులు మాత్రమే సిద్ధమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ వివిధ శాఖల అధికారులు పర్యవేక్షిస్తుండడంతో కొద్దిరోజులుగా దుస్తుల తయారీలో వేగం పుంజుకున్నది. అయితే హడావిడిగా దుస్తులను కుట్టడం వల్ల నాణ్యతాప్రమాణాలతోపాటు సైజుల విషయంలోనూ లోటుపాట్లు చోటు చేసుకుంటాయోనన్న ఆందోళన అధికార వర్గాల్లో నెలకొన్నట్లు తెలుస్తున్నది.
యూనిఫామ్స్ ఆదివారం నాటికి యాభై శాతం వరకు సిద్ధమయ్యాయి. చాలావరకు స్టిచ్చింగ్ పూర్తై చివరి దశలో ఉన్నాయి. అధికారుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నది. ఓ పక్క దుస్తుల తయారీతోపాటు మరోపక్క విద్యార్థులతో ట్రయల్ రన్ కూడా సాగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ తెరిచే నాటికి విద్యార్థులకు డ్రెస్సులను అందజేస్తాం.
-సుశీందర్‌రావు, రంగారెడ్డి డీఈవో