Rains | యాచారం మే26: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వ ఉన్న పాఠశాల ప్రహారీ గోడ కూలింది. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో పాఠశాలకు పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో పూర్వ విద్యార్థుల సహకారంతో ఇటీవల మరమ్మతులు చేయించారు. తరగతి గదులు, ఆఫీసు కార్యాలయానికి మరమ్మతులు చేసి, రంగులు వేయించి ఆధునీకరించారు. అయితే పాఠశాల ప్రహారీ గోడ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి సోమవారం ఉదయం కూలిపోయింది. అయితే సెలవులు కారణంగా విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఎవరైనా దాతలు ముందుకొచ్చి పాఠశాలకు నూతన ప్రహారీ గోడను నిర్మించడానికి సహకరించాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.