రంగారెడ్డి, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : రుణమాఫీ ఏమోగానీ..చిక్కుముడుల పరిష్కారానికి రైతాంగం అగచాట్లు పడాల్సి వస్తున్నది. వానకాలం సాగు పనులను సైతం వదులుకుని మాఫీ.. చెయ్యండి మహాప్రభో! అంటూ అటు బ్యాంకర్లు, ఇటు వ్యవసాయధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్న రూ.లక్ష.. నిన్న లక్షన్నర.. రుణమాఫీ విషయంలోనూ అవే కొర్రీలు.. అవే తిప్పలతో రైతాంగం సతమతమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,700 మంది రైతులకు రూ.258.18 కోట్ల రుణమాఫీ, రెండో విడుతలో 22,915 మంది రైతులకు రూ.218.12 కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. అర్హులు లక్షల్లో ఉండగా.. మాఫీని వేలమందికే చేసి ప్రభుత్వం చేతులుదులుపుకొన్నది. మాఫీ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌తోపాటు మండలాల్లో గ్రీవెన్స్ ఏర్పాటుచేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రేపు, మాపు మాఫీ అవుతుందని అధికారులు చెబుతున్న మాటలతో జిల్లా రైతాంగం విసిగిపోతున్నది.
అంతుపట్టని మాఫీ..
రెండు విడుతల రుణమాఫీల్లోనూ నేటికీ చిక్కుముడులు వీడడం లేదు. రుణమాఫీ ప్రక్రియలో సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అర్హులైనవారికీ రుణమాఫీ ఎందుకు కాలేదో.. అంతుబట్టడం లేదు. ప్రభుత్వం రూపొందించిన ఉత్తర్వుల మేరకు పట్టా పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ తొలి విడుతలో రూ.లక్ష వరకు, రెండవ విడుతలో లక్షన్నర వరకు మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావాలి. కానీ.. బ్యాంకులు పంపిన జాబితాల్లో ఉన్న రైతుల్లో చాలామందికి మాఫీ జమకాకపోవడంపై గందరగోళం నెలకొన్నది. ఇందుకు అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. ఖాతాల్లో పేర్లకు, ఆధార్‌కు మధ్య తేడా కారణంగానే మాఫీ డబ్బులు జమకాలేదని అధికారులు చెబుతున్నారు.
రేషన్‌కార్డులో పేరులేకపోతే కూడా రుణమాఫీ డబ్బులు పడలేదు. దీంతో జాబితాలో పేరున్న రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాలేదు. మొదటి విడుతలో 1,502 మంది రైతులకు సంబంధించి రూ.28కోట్లకు పైగా మాఫీ డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. సంబంధిత రైతుల వివరాలను సేకరించి రాష్ట్రస్థాయి అధికారులకు పంపించామని జిల్లా అధికారులు చెబుతున్నారు. కానీ.. ఇప్పటివరకు ఎంత మంది రైతులకు న్యాయం జరిగిందో స్పష్టత లేదు. ఇక రెండో విడుతలోనూ 194 మంది రైతులకు సంబంధించి రూ.1.50కోట్లు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉన్నది. వివిధ కారణాలతో జమకాలేదని అధికారులు చెబుతున్నారు. జాబితాలో పేరు వచ్చినప్పటికీ ఖాతాల్లో మాఫీ డబ్బులు జమకాకపోవడంపై రైతుల్లో ఒకింత ఆందోళన నెలకొన్నది.
ఫిర్యాదులకు పరిష్కారమేదీ..
మూడు విడుతల్లో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా జూలై 19న మొదటి విడుతను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాలో సుమారు 49,700 మంది రైతులకు రూ.258.18కోట్లను రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ నంబర్, ఇతర వివరాలు లేకపోవడం.. అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో చాలామందికి రుణమాఫీ జరగలేదు. అలాగే.. ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులను అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించడంతో మరి కొంతమంది రైతులకు రుణ విముక్తి కలుగలేదు. ఇక జాబితాలో పేరు వచ్చినప్పటికీ జిల్లాలో 1,502 మంది రైతులకు సంబంధించి రూ.28 కోట్ల వరకు మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. మొదటి విడుతలో రుణమాఫీ కానివారి నుంచి వినతుల స్వీకరణకు జిల్లా వ్యవసాయ కార్యాలయంతోపాటు, మండలాల్లో ప్రభుత్వం గ్రీవెన్స్ ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారులు, ఈఏవోలకు జిల్లా వ్యాప్తంగా 1,332 మంది రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. వీటికి ఇంకా పరిష్కారం లభించలేదు. రైతులు చెప్పిన సమస్యను నమోదు చేసుకోవడం తప్ప.. అధికారులు పరిష్కారం చూపడంలేదు. దీంతో బాధిత రైతులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే అధికారులు రుణమాఫీకి సంబంధించి అటు బ్యాంకుల్లో, ఇటు వానకాలం పంటల పరిశీలన, నమోదు కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో రైతులకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. పరిష్కారానికై ఫిర్యాదులను రాష్ట్రస్థాయి అధికారులకు పంపించామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అధికారుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ ఇదే సమాధానం వస్తుండడంతో ఇంకెప్పుడో! అని రైతాంగం విసుగెత్తిపోతున్నది. కొద్దిమందికే మాఫీ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేయవద్దని రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతున్నది.
నా బ్యాంకు ఖాతాకు వేరొకరి ఆధార్ నంబర్ లింక్ నాకు రుణ మాఫీ కాలేదు. వ్యవసాయ శాఖ అధికారిని కలిసి అడుగగా.. చెక్ చేసి సొసైటీ బ్యాంకులో నా ఖాతా నంబరుకు వేరొకరి ఆధార్ నంబర్ లింక్ అయ్యిందని తెలిపారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామానికి చెందిన రైతు ఆధార్ నంబర్ నా ఖాతాకు లింక్ అయిందని, అందుకే మాఫీ కాలేదని చెప్పారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. బ్యాంకు వాళ్లు నాకు మోసం చేసినట్లు అయింది.
– బ్యాగరి సాయిలు, చిన్నమంగళారం, మొయినాబాద్