వికారాబాద్, డిసెంబర్ 22 : పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఏడాది గడిచినా తమను ఇంకా క్రమ బద్ధీకరించకపోవడంతో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. గత 17 రోజులుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నాలు, ర్యాలీలు, వివిధ రీతుల్లో నిరసన తెలుపుతున్నారు. వంటావార్పు, అమరవీరుల స్థూపం వద్ద నిరసన, చాకలి ఐలమ్మ వేషధారణలో ఓ ఉద్యోగిని నిరసన తెలిపారు.
హామీని అమలు చేసి.. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు తక్షణమే పేస్కేల్‌ను అమలు చేయాలని, మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న ఉద్యోగులకూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు అందించినా ఫలితం లేకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు.ఇందులో ఎంఆర్సీ, సీఆర్సీ, పాఠశాల, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్, డీపీవో స్థాయిలో అన్ని విభాగాల ఉద్యోగులు దాదాపుగా 750 మంది ఉన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
కులకచర్ల మండలంలో సీఆర్పీగా గత 12 ఏండ్లుగా పని చేస్తున్నా. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హాదాలో రేవంత్‌రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ అధికారంలోకి రాగానే క్రమబద్ధీకరిస్తానని మాటిచ్చారు. కానీ ఏడాది దాటినా హామీని నెరవేర్చలేదు. జిల్లాలో 750 మంది ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు.
– కేతావత్ గంగ్యానాయక్, జేఏసీ జిల్లా చైర్మన్, వికారాబాద్
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాయ్ తాగినంత సేపట్లో జీవోను విడుదల చేయిస్తానని అప్పటి పీసీసీ హోదాలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయి ఏడాది దాటినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. గత 12 ఏండ్లుగా కేజీబీవీలలో పని చేస్తున్నా. సీఎం ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలి.
-ప్రభావతి, కేజీబీవీ, మోమిన్‌పేట
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించి.. ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలి. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తాం.
-శ్రీశైలం, మెసెంజర్, పరిగి