పరిగి, నవంబర్ 14 : రైతులూ భయపడొద్దని.. మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అభయమిచ్చారు. రైతుల కుటుంబాలకు భరోసా కల్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మమ్మల్ని ఇక్కడికి పం పించారని, అరస్టైన వారందరూ తమ కుటుంబసభ్యులుగానే భావిస్తున్నామన్నారు.
లగచర్ల ఘటనలో అరస్టై పరిగి సబ్‌జైలులో ఉన్న రైతులను ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, హరిప్రియానాయక్లతో కలిసి ఆమె పరామర్శించారు. అనంతరం సబితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడి జరగలేదని కలెక్టర్ అంటుండగా.. దాడి జరిగిందని పోలీస్‌శాఖ అంటున్నదని.. దీనిలో ఎవరి మాట నమ్మాలని ప్రశ్నించారు. ఈ ఘటన పోలీస్ శాఖ వైఫల్యమని, ఆ శాఖను చూస్తున్న సీఎం రేవంత్ ఫెయిల్యూర్ అని మండిపడ్డారు. వారి వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై నెపం నెడుతున్నారని ఆరోపించారు.
ఒక ప్రజా నాయకుడిగా 15 పర్యాయాలు కాదు 30 పర్యాయాలు మాట్లాడతారని, జనాలకు ఇబ్బంది ఉన్నప్పుడు మా కార్యకర్తలు వందసార్లు ఫోన్ చేస్తారని, మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల కోసం తామంతా జైలుకెళ్లేందుకు సిద్ధమని.. మమ్మల్ని జైల్లో పెట్టి రైతులను వదిలిపెట్టాలని సబితారెడ్డి డిమాండ్ చేశారు. జైలులో ఉన్న రైతులు, బయట ఉన్న వారి కుటుంబసభ్యుల ఆవేదన చూస్తుంటే బాధ కలుగుతున్నదని, కన్నీళ్లు వస్తున్నాయన్నారు.
లగచర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు రైతులు, అటు అధికారులు ఇబ్బంది పడుతున్నారన్నా రు. ఆ ఘటనలో పాల్గొనని వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారని, గ్రామ కార్యదర్శి పక్క గ్రామంలో సర్వే చేస్తుంటే అతడిపైనా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ కేసులో 55 మందిని తీసుకొచ్చి 21 మందిని పంపించామని పోలీసు అధికారి చెప్పారని, కాంగ్రెస్ పార్టీ నాయకులను పక్కన పెట్టి బీఆర్ఎస్కు సంబంధించిన వారినే అరెస్టు చేశారన్నారు. ఠాణాలో రైతులను తీవ్రంగా హింసించారన్నారు. పోలీసు లు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాల్సి ఉండగా కేవలం బీఆర్ఎస్పైనే నెపం నెట్టడం రేవంత్‌రెడ్డి ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు.
ఈ డైవర్షన్ రాజకీయంలో రైతులు బలిపశువులు అయ్యారన్నారు. ఈ కేసులో అకారణంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఈ కేసులో ఇరికించాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల కేటీఆర్ బావమరిది ఇంట్లో దావత్ అయితే ఆ కేసు, కార్ రేసింగ్ కేసుల్లోనూ మాజీ మంత్రిని ఇరికించాలని శతవిధాలా య త్నిస్తున్నారని ఆరోపించారు. మీరు ఎంతమందిని జైలుకు పంపించినా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని ఆమె స్ప ష్టం చేశారు.
కేసీఆర్ పేరును చెరిపేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఒక మాట, ఉంటుందని మరోమాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్ ప్రజలు ఓటేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచి.. సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. తన సెగ్మెంట్లో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే ఎందుకు ఒక్క మాటా మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆయనకు ఓటేసిన రైతులను జైలు కు పంపించారని తీవ్రంగా దుయ్యబట్టారు.
సబ్‌జైలులో ఉన్న రైతులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబసభ్యులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తాము భూములను ఇవ్వబోమని గిరిజన యువతి పేర్కొన్నది. దాడి ఘటనలో లేకున్నా అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మీరందరూ మా కుటుంబసభ్యులేనని కేసీఆర్, కేటీఆర్ చెప్పారని, రైతులందరికీ పార్టీ బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. కడా అధికారిని కాపాడి, తాగేందుకు నీరు ఇచ్చి న వారిపైనా కేసు పెట్టారని తెలిపారు.
కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వికారాబాద్ బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, కమాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాములు, సంతోష్, పాండు, శేఖర్‌రెడ్డి, చేవెళ్ల నాయకుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా విఫలమయ్యా రు. కలెక్టర్‌పై దాడి జరిగిందంటే నిఘా విభాగం ఏమి చేస్తున్నట్లు. తాను సురేశ్‌తో మాట్లాడినట్లు ఆధారాలు చూపిస్తే.. రైతుల కోసం జైలుకెళ్లేందుకూ సిద్ధమే. తాటాకు చప్పుళ్లకు భయపడా. కలెక్టర్ అసలు దాడే జరగలేదని చెబితే.. పోలీసులు దాడి జరిగిందని ఎందుకు అరెస్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని అంటు న్నారు.. లగచర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చింది.. అలాంటప్పుడు బీఆర్ఎస్ వారు చెబితే అక్కడి కాంగ్రెస్ నాయ కులు వింటారా..?
-డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
రైతులు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు ఇవ్వబోమని చెప్పినా వినకుండా బలవంతంగా తీసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. లగచర్లలో కాంగ్రెస్ కార్యకర్తలే దాడి చేయగా..55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ పార్టీ నాయకులను వదిలిపెట్టారు.
-కోవా లక్ష్మి, ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలోనే రైతుల పరిస్థితి ఇలా ఉందంటే..రాష్ట్రంలోని ప్రజలు, రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గతంలో పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా మాజీ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు.
-హరిప్రియానాయక్, మాజీ ఎమ్మెల్యే