రంగారెడ్డి, జూలై 6 (నమస్తే తెలంగాణ)/కందుకూరు : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేశామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఫార్మా సిటీ పేరుతో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె కందుకూరు మండలంలోని పోతుగడ్డతండా, సార్లరావులపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి భూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఫార్మా సిటీని రద్దు చేస్తే వెంటనే ఆ భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పొల్యూషన్ రహిత ఫార్మా సిటీని ఏర్పాటు చేయడం కోసం రైతులను అన్ని విధాలుగా ఒప్పించి 14 వేల ఎకరాల భూమిని సేకరించి వారికి పరిహారంతోపాటు ఎకరాకు గుంట భూమి చొప్పున ఇంటి స్థలం కూడా అందించారని చెప్పారు. ఈ ప్రాంతంలో ఫార్మా సిటీని ఏర్పాటు చేసి అనేకమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని కాంగ్రెస్ పెద్దలు తప్పుడు ప్రచారాలు చేశారన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు పెద్దలు ఫార్మా సిటీ ప్రాంతంలో పర్యటించి.. తాము అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని, కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించి మొహం చాటేస్తున్నారన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలను ఫ్యూచర్ సిటీకి తీసుకోవడం చట్టవిరుద్ధమని, ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఫార్మా సిటీకే వాడుకోవాలని, లేదా రైతులకివ్వాలని.. ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి మళ్లించడం శోచనీయమన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మించాలనుకుంటే కొత్తగా భూసేకరణ చేసుకోవాలని సూచించారు.
మభ్యపెడుతున్నారు..
కందుకూరు మండలంలోని ముచ్చర్ల గ్రామంలో ఇటీవల 400 ఎకరాల పట్టా భూములను ఫార్మా సిటీ ఏర్పాటుకు తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. ఫార్మా సిటీ లేనప్పుడు మళ్లీ ఫార్మా సిటీ పేరుతో నోటిఫికేషన్ ఎలా వేస్తారని.. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను తాము ఎండగడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. భూములకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని, రేవంత్ సర్కారు మాత్రం పరిహారం చెల్లించకుండానే భూములను బలవంతంగా తీసుకుంటున్నదని ఆరోపించారు.
మరోవైపు భూములివ్వడానికి ముందుకు రాని రైతుల భూములను బలవంతంగా నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని మండిపడ్డారు. రైతులను ఒప్పించేలా కాకుండా బెదిరించే ధోరణిలో భూములు తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ఫ్యూచర్ సిటీతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగలేదని, కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఫ్యూచర్ సిటీ రావడంతోనే భూముల ధరలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని తాను ఇటీవల జరిగిన సభలో మాట్లాడినందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ప్రకటన చేసి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడా ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఫ్యూచర్ సిటీతో ఈప్రాంతానికి పెద్దగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ప్రభు త్వం మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదని ఎద్దేవా చేశారు.
బలవంతపు భూసేకరణను నిలిపివేయాలి
రైతుల అభిప్రాయం తీసుకోకుండా వారి భూములను బలవంతంగా తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని సూచించారు. రైతుల అభిప్రాయాలు తీసుకుని వారు కోరుకున్న పరిహారం ఇవ్వాలని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 14 వేల ఎకరాలను కేసీఆర్ చిన్న పొరపాటు జరుగకుండా సేకరించారని, రైతుల కోరిక మేరకు పరిహారంతోపాటు అదనంగా రైతులు అడగకుండానే ఎకరాకు గుంట చొప్పున ఇంటి స్థలం కూడా ఇచ్చిన ఘనత బీ ఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడితే రైతులకు అండగా తాముంటామని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి,చంద్రశేఖర్,ప్రవీణ్‌నాయక్, శేఖర్,రాములు, దేవేందర్,బాలకృష్ణ,రామకృష్ణ,శ్రీకాంత్,రాజు,నర్సింహ,మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.