శంషాబాద్ రూరల్, నవంబర్ 26 : ‘కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తున్నది.. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టారు.. ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదు.. కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి..’ అని మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మంగళవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు.
ఈ నెల 29న జరిగే దిక్షా దివస్‌ను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ ఫార్మాసిటీ పేరుతో కొడంగల్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కునేందుకు రైతులను గోస పెడుతున్నదన్నారు. రేవంత్‌రెడ్డి తన సోదరులు కలిసి అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో 144సెక్షన్ విధించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, పదేండ్లు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించి సబ్బండ వర్ణాల మెప్పుపొందిన మహానేత కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మోసాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు వివరించారు.
కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం దిక్షాదివస్ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ నాడు దీక్ష చేపట్టడంతోనే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. దీంతో 2014లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించారని తెలిపారు.
ఈ నెల 29న ఉదయం 8 గంటలకు గ్రామాలు, వార్డుల్లో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడంతో పాటు 10 గంటలకు శంషాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి కార్యాలయంలో దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వెంకటరమణరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తీగల విక్రంరెడ్డి, కొంపల్లి అనంతరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎమ్మె సత్యనారాయణ, శంషాబాద్ మాజీ ఎంపీపీ సాయమ్మాశ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ బుర్కుంట సతీశ్, శంషాబాద్ కౌన్సిలర్ భారతమ్మ, దిద్యాల శ్రీనివాస్, దేశమోల్ల ఆంజనేయులు, కొన్నమొల్ల శ్రీనివాస్, సాయిబాబా, గంటి చరణ్ పాల్గొన్నారు.