వికారాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి కేవలం భూసేకరణపైనే దృష్టి సారించి పెట్టుబడులను గాలికి వదిలేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. శనివారం మోమిన్‌పేట మండలంలోని ఎన్కతల గ్రామ పరిధిలోని మొబిలిటీ వ్యాలీ పనులను మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమర్‌రాజా కంపెనీకి రిబ్బన్ కట్ చేశారని, షాబాద్ దగ్గర, సీతారాంపూర్ వద్ద కూడా నేనే కంపెనీలను తెచ్చిన అని రిబ్బన్ కట్ చేశారు కానీ.. ఎన్కతలలో త్వరగా పూర్తి చేసి రిబ్బన్ కట్ చేయాలని, అందుకు సీఎంకు చేతనైతలేదన్నారు.
ఇప్పటికే చాలాసార్లు మొబిలిటీ వ్యాలీలో కంపెనీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామని, చేసుంటే ఈపాటికే కంపెనీలు వచ్చేవి, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే ప్రజలకు కనపడుతుందని, కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలే నడుస్తున్నా యని.. కనీసం ఈ రెండేైళ్లెనా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని ఆమె రేవంత్‌కు హితవు పలికారు. భూసేకరణ పూ ర్తైన మొబిలిటీ వ్యాలీ వద్ద కంపెనీలను ఏర్పాటు చేయకుండా పరిగి నియోజకవర్గంలోని నాలుగు గ్రామాల్లో, కొడంగల్ నియోజకవర్గంలో ఇలా అవసరంలేని చోట భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు.
మొబిలిటీ వ్యాలీలో హ్యూందాయ్లాంటి ఈవీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం చొరవ చూపడంలేదని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్కతలలో 1100 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు చర్యలు తీసుకోగా.. 600-700 ఎకరాలకు చెందిన రైతులకు నష్టపరిహారం కూడా అందించగా.. మిగిలిన రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. అక్కడ కంపెనీలు ఏర్పాటైతే బాధిత కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇవ్వాలని అనుకున్నామని, హ్యూందాయ్లాంటి కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోగా, తదనంతరం ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆలోచన కూడా మారిపోయిందన్నారు.
ఇంకా మిగిలిన రైతులకు నష్టపరిహారాన్ని త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ హ యాంలో రాష్ర్టానికి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 24 వేల కంపెనీలను ఏర్పాటు చేయగా, సుమారు 24 లక్షల మంది యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చాయన్నారు. మరోవైపు ఆగిపోయిన మొబిలిటీ వ్యాలీ పనులను మేమొచ్చామని చేస్తున్నారని, మొబిలిటీ వ్యాలీ నుంచి అక్రమంగా రాత్రి సమయాల్లో ఎర్రమట్టి తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారన్నారు.
జహీరాబాద్, వికారాబాద్, షాబాద్, దివిటిపల్లిలలో 3 ,000 ఎకరాల్లో రూ. 50,000 కోట్లతో 4,00,000 మందికి ఉపాధి కల్పించేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటుకు ముందుకొచ్చిందని.. జహీరాబాద్, షాబాద్, దివిటిపల్లిలలో కంపెనీలు ఏర్పాటై ఎలక్రిక్ వాహనాల తయారీ జరుగుతుండగా.. వికారాబాద్ నియోజకవర్గంలో కంపెనీల ఏర్పాటుపై ఎవరూ పట్టించుకోరా..? అని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రశ్నించారు. ఇక్కడ అసమర్థ పాలకుడు ఉన్నాడని మండిపడ్డారు. మీకు అభివృద్ధి చేసే సత్తా లేకుంటే .. కంపెనీలు తీసుకొచ్చేందుకు చేతకానప్పుడు తీసుకున్న భూములను రైతులకు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఎన్కతలలో దాదాపు 1100 ఎకరాలను సేకరించి సుమారు 400 మంది రైతులకు రూ.100 కోట్ల పరిహారాన్ని చెల్లించామని.. మరికొందరికి ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో మొబిలిటీ వ్యాలీ అభివృద్ధితో భూముల ధరలు అమాంతం పెరిగాయని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్య వైఖరితో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందన్నారు. ప్రజలు గెలిపిస్తే గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన స్పీకర్ పట్నం వదిలి నియోజకవర్గానికి రావడంలేదని.. ఆయన్ను కలవాలంటే గగనమవుతున్నదని ఎద్దేవా చేశారు. స్పీకర్ నియోజకవర్గ అభివృద్ధి కంటే సొంత అభివృద్ధి పైనే దృష్టి పెట్టారన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని, రోడ్లు బాగాలేక పిల్లనిస్తలేరని స్పీకరే చెప్పారని, మరీ మూడేళ్లలో ఏం చేశారని, ఇంకా బీఆర్ఎస్ నాయకులపై ఏడుపేనా అని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకట్, శ్రీకాంత్‌గౌడ్, నర్సింహరెడ్డి, గోపాల్, వేణుగోపాల్‌రెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు, ఆగస్టు 22 : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల సంక్షేమానికి కృషి చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం మండల కేంద్రంలోని మురళీనగర్ గ్రామంలో గిరిజన మహిళలు తీజ్ పండగను ఘనంగా నిర్వహించారు. మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనలు సమస్యలను గుర్తించిన కేసీఆర్ వారిని అన్ని రంగాల్లో ఆదుకున్నట్లు వివరించారు.
500 జనాభా ఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తండాల్లో నిద్రలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా వారి సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహరెడ్డి, జయుందర్ ముదిరాజ్, మహేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, ఆనంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ క్రిష్ణానాయక్, రామానుజం తదితరులున్నారు.