షాబాద్, సెప్టెంబర్ 11 : ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌లోని స్ట్రార్ గార్డెన్లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో సబితారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లను ఘనంగా సన్మానించారు. అక్కడి నుంచి ర్యాలీగా కార్యక్రమం వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ వర్షాలు పడకముందే రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేవారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారులో గత రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటకు ముందు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెబుతున్నాడని, కోటీశ్వరులను చేయడం దేవుడెరుగని.. ఆడబిడ్డలను యూరియాకు లైన్లో నిలబెడుతున్నాడని, చిన్నపిల్లలను ఎత్తుకుని, పది మందిలో కూర్చుని బిడ్డకు పాలిస్తూ లైన్లో నిలబడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆడబిడ్డలు బిందెపట్టుకుని నీటి కోసం రోడ్డుమీదికి వస్తే పరువుపోతుందంటే, రేవంత్‌రెడ్డి మాత్రం గేట్లు ఎక్కి దుంకేలా చేసిండన్నారు. రైతులు యూరియా కూపన్లు పోలీసుల సమక్షంలో తీసుకుంటున్నారని చెప్పారు.
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని.. బీజేపీ వాళ్లు తాము యూరియా ఇచ్చామని చెబుతున్నారని, కాంగ్రెస్ వాళ్లు యూరియా రాలేదని చెబుతున్నారని.. మరి యూరియా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. వాళ్లిచ్చామని చెప్పడం, వీళ్లు రాలేదని చెప్పడం ఇద్దరు దొంగాట ఆడుతూ తప్పించుకుంటూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. రైతులు బాధపడుతుంటే సోయి లేకుండా రాజకీయం చేస్తున్నారు గానీ రైతుల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదోడే గుడిసె కింద ఉన్నాడు.. ఇళ్లు ఇవ్వాలని ఆలోచన రాలేదని, గాంధీభవన్ నుంచి ఇళ్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ కండువా వేసుకుని ఊర్లల్లో ఎంత రాజకీయం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు పెడితే కాంగ్రెస్సోళ్లు ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవలేరని చెప్పారు. ఇప్పటివరకు సింగిల్‌విండో చైర్మన్లు అందరూ బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారని, వారిని పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. లేకపోతే పదవి నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. రైతుల ఓట్లతో గెలిచిన సింగిల్‌విండో చైర్మన్లను కూడా ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఇచ్చి మార్చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు ఎరువుల సరిగ్గా ఇయ్యడం సోయిలేక, చైర్మన్లు ఇస్తలేరనే నెపంతో వాళ్లను తీసేసే ప్రయత్నం చేస్తున్నారని, అది కూడా కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట మాత్రమే చేస్తున్నారన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా అందించి ఆదుకున్నాడరన్నారు. ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష కుల మత భేదం లేకుండా ఇచ్చారన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చినంక తులం బంగారం ఇస్తామని ఆశ చూపించి, మోసం చేశాడన్నారు. ఎకరాకు రూ.15వేలు వేసి ఓటు అడగమని చెప్పాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ షాబాద్, చేవెళ్ల మండలాల అధ్యక్షులు నర్సింగ్‌రావు, ప్రభాకర్, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి ఆంజనేయులు, యువ నాయకుడు కౌశిక్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు కవిత, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్‌పాషా, షాబాద్ మాజీ సర్పంచ్ వెంకట్‌యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. యూరియా సంచులు కాంగ్రెస్, బీజేపీ నాయకుల గోదాంలోకి పోయాయన్నారు. రూ.270కి రావాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో రూ.800లకు అమ్ముతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు ఎదురుతిరిగి కాలె యాదయ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యాడన్నారు. కాలె యాదయ్య రాజీనామా చేసి మళ్లీ చేవెళ్లకు వచ్చి నీ మొహం చూపించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో టీజీపీఏస్సీ భ్రష్టు పట్టిందన్నారు. ట్రాన్స్‌ఫర్‌కు రూ.30లక్షలు, గ్రూప్-1 పోస్ట్‌కు రూ.3కోట్లు నడుస్తున్నదని నిరుద్యోగ అభ్యర్థులు అంటున్నారని తెలిపారు. 563 పోస్టులకుగాను రూ.1700 కోట్ల కుంభకోణం జరిగిందని నిరుద్యోగులు మండిపడుతున్నారని చెప్పారు. యూరియాను దొంగతనం చేస్తూ, యూరియా లారీలను దాచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సింగిల్ విండో చైర్మన్లు ఉన్న దగ్గరికి యూరియా పంపిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలడంపై అక్కడి ఇంజినీర్ మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ చేస్తే ఇంతవరకు పోలీసులు దానిపై విచారణ చేపట్టలేదన్నారు. హైదరాబాద్‌లో రూ.12వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారన్నారు. ఇక్కడి పోలీసులు మాత్రం బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కావాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. హైతాబాద్‌లో ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించడంతో కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. ఇన్ని రోజులు కార్యకర్తలు మా కోసం కష్టపడ్డారని, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గెలిపించేందుకు మీకోసం మేము పనిచేస్తామన్నారు. ఇంతకు ముందు షాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ధర్నాలో పాల్గొనడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నింపారని, ఈ రోజు ఇక్కడ జరిగిన సమావేశంతో కార్యకర్తల్లో మరింత జోష్ వచ్చిందని, మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రాబోవు ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని తెలిపారు.